టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాలన అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో మక్కువ. చంద్రబాబు వంటి విజనరీ నేత తీసుకునే నిర్ణయాలు, ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం చూపించే చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. చంద్రబాబు పరిపాలన దక్షత గురించి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ సైతం ఎన్నోసార్లు కితాబిచ్చారు. చంద్రబాబు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఆ ప్రశంసల జాబితాను మరింత పెంచింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ ఘటనపై చంద్రబాబు రియాక్ట్ అయిన వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధమైన ఘటనపై చంద్రబాబు సీరియస్ గా సత్వరమే స్పందించిన తీరు రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. కోట్లాది రూపాయల విలువైన భూములకు సంబంధించిన కీలక ఫైళ్ళు దగ్ధమయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆ ఘటనపై తక్షణమే స్పందించారు. హుటాహుటిన మదనపల్లెకు వెళ్లాలని ఏపీ డీజీపీ, ఏపీ సిఐడి చీఫ్ లను చంద్రబాబు ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు చంద్రబాబు ఆదేశాల ప్రకారం మదనపల్లెకు చేరుకునేందుకు ఏపీ డీజీపీ, సిఐడి చీఫ్ హెలికాప్టర్ లో బయలుదేరడం విశేషం.
ఇక, కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకునే ముందు ఆ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నమయ్య జిల్లాలో వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇష్టారాజ్యంగా పంచిపెట్టిందని ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే ఆధారాలు తుడిచిపెట్టేందుకు అగ్ని ప్రమాదం జరిగిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇక, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు ప్రభుత్వ ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరగడం, విజయవాడ కరకట్ట మీద ఫైళ్లు దగ్ధం కావడం వంటి ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలోనే ఈ మదనపల్లె ఘటనపై సత్వర విచారణ జరపాలని, కారణాలు తేల్చి వివరాలను తనకు అందించాలని ఏపీ డీజీపీని చంద్రబాబు ఆదేశించారు. ఏది ఏమైనా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘటనపై చంద్రబాబు రియాక్ట్ అయిన వైనం ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates