హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు హెచ్చ‌రిక‌ల‌తోనే స‌రిపెడుతున్నారు. ఎంత పెద్ద త‌ప్పు చేసినా.. కేవ‌లం స‌స్పెన్ష‌న్తోనే స‌రిపుచ్చుతున్నారు. దీంతో మూడు మాసాలు ఆగి..త‌ర్వాత వారు భేషుగ్గా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దీనివ‌ల్ల పార్టీ నాయ‌కుల‌కు పెద్ద‌గా సీరియ‌స్ నెస్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అయినా.. చంద్ర‌బాబు మాత్రం సీరియ‌స్ యాక్ష‌న్‌ను కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌తోనే స‌రిపెడుతున్నారు.

గుడివాడ‌లో పార్టీ నాయ‌కుల మ‌ధ్యే స‌మ‌న్వ‌యం లేకుండా పోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనిని తాజాగా సీఎం చంద్ర‌బాబు కూడా అంగీక‌రించారు. గత ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యంద‌క్కించుకున్న వెనిగండ్ల రాముకు సొంత నేత‌ల నుంచే ఎదురుదాడి వ‌స్తోంద‌న్న‌ది వాస్త‌వం. కొంద‌రు నాయ‌కులు స‌మాచారాన్ని వైసీపీకి చేర‌వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే రాముపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనిపై ఆయ‌న పార్టీ అధినేత‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాల‌ను.. తాజాగా చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

గుడివాడ ప‌ర్య‌ట‌న‌లో నియోజ‌క‌వ‌ర్గం స్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో రెండు గంట‌ల‌కు పైగానే చంద్ర‌బాబు చ‌ర్చించారు. ఎవ‌రెవ‌రు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. ఆయ‌న పేర్ల‌తో స‌హా వివ‌రించారు. ఈ క్ర‌మంలో పార్టీలో క‌ట్టుత‌ప్పితే .. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని య‌థాలాపంగా మ‌రోసారి హెచ్చ‌రించారు. దీనిని పార్టీ నాయ‌కులు అప్ప‌టిక‌ప్పుడు సీరియ‌స్‌గా తీసుకున్నా.. త‌ర్వాత‌.. ఎలానూ లైట్ తీసుకుంటార‌న్న‌ది తెలిసిందే. కేవ‌లం స‌స్పెన్ష‌న్లు.. హెచ్చ‌రిక‌ల‌తోనే క్ర‌మ‌శిక్ష‌ణ వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

కానీ, ఈ వ్య‌వ‌హారం ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇటీవ‌ల ఎంపీల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలోనూ ప‌లువురు సీనియ‌ర్ ఎంపీలు ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబుకు చెప్పారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు త‌మ మాట వినిపించుకోవ‌డం లేద‌న్నారు. దీంతో అభివృద్ది కుటుంబ‌ప‌డుతోంద‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోలేకపోతున్నామని.. నంద్యాల‌, క‌ర్నూలు, అనంత‌పురం, విజ‌య‌నగ‌రం ఎంపీలు చెప్పుకొచ్చారు. అయినా చంద్ర‌బాబు మాత్రం స‌మ‌న్వ‌యం చేసుకునే బాధ్య‌త మీదేన‌ని తేల్చేశారు. ఫ‌లితంగా కేడ‌ర్‌లో ఎలా ఉన్నా.. సీనియ‌ర్ నాయ‌కులకు స్వేచ్ఛ ఇచ్చిన‌ట్టుగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇది పార్టీకి మేలు చేయ‌ద‌ని వారు చెబుతున్నారు.