అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం పట్టింది. అరంగేట్రం చేసిన నాలుగేళ్లకు ‘సత్యం’ సినిమాతో తొలి విజయం అందుకున్నాడు. కానీ తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. ఇలా ఒక హిట్టు కొట్టడం, తర్వాత వెనుకబడడం.. చాలా గ్యాప్ తర్వాత ఇంకో సక్సెస్ సాధించడం, మళ్లీ కెరీర్లో జోరు తగ్గడం.. ఇలా ఎన్నోసార్లు జరిగింది.
‘మళ్ళీ రావా’తో ఒక టైంలో మంచి బ్రేక్ అందుకున్న అతను.. మళ్లీ తడబడ్డాడు. ఈ మధ్య ‘అనగనగా’ అనే ఓటీటీ చిత్రంతో మెప్పించిన సుమంత్.. ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు సుమంత్ నుంచి ‘న్యూటన్స్ థర్డ్ లా’ అనే సినిమా రాబోతోంది. జగపతిబాబు ఇంకో ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా నేరుగా ట్రైలర్‌తో పలకరించింది.
ప్రతి చర్యకూ సమానమైన ప్రతి చర్య ఉంటుంది అన్నది న్యూటన్స్ థర్డ్ లా. దీని నేపథ్యంలో రాజేష్ కర్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. టైటిల్‌కు తగ్గట్లే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రేసీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లున్నారు. సుమంత్, జగపతిబాబు సహా కీలక పాత్రలన్నీ క్యూరియాసిటీ రేకెత్తించేలా ఉన్నాయి. ట్రైలర్ కట్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో ఏదో మర్మం ఉంటుందని.. స్క్రీన్ ప్లే ప్రధానంగా థ్రిల్లింగ్‌గా సినిమాను తీర్చిదిద్దారని అనిపిస్తోంది. కాకపోతే ఈ సినిమాను కాస్త ముందు నుంచే టీం ప్రమోట్ చేయాల్సింది.
మంచి కాన్సెప్ట్‌తో, క్వాలిటీతో సినిమా తీసినట్లున్నారు కానీ.. ఈ పేరుతో ఒక సినిమా తెరకెక్కినట్లే జనాలకు ఇప్పటిదాకా తెలియదు. ఈ మధ్యే సినిమాను అనౌన్స్ చేశారు. జులై 31నే సినిమాను విడుదల చేయబోతూ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు. సుమంత్ మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో కొంచెం ముందే ఈ సినిమా విశేషాలను పంచుకుని.. ఒకట్రెండు టీజర్లు వదిలి, జనాల్లో ఆసక్తి రేకెత్తించాక విడుదల ముంగిట ట్రైలర్ వదలాల్సింది. ఇప్పుడే సినిమాను పరిచయం చేసి సడెన్‌గా రిలీజ్ అంటే జనాలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

