పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ కాకున్నా… గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులు పెద్దవేమీ కాకున్నా… ఎప్పటికప్పుడు పార్టీలో నిరసన గళాలు క్రమంగా వినిపిస్తున్న తీరుపై ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. గతంలో గుట్టుచప్పుడు కాకుండా అసంతృప్తులు వ్యక్తం కాగా… ఇప్పుడు ఆ అసంతృప్తులు బహిరంగంగానే వ్యక్తం అవుతుండటం ఒకింత ఆందోళనకరమేనని చెప్పాలి. అంతేకాకుండా వరుసబెట్టి వినిపిస్తున్న ఈ ఆందోళనలు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా కూడా పరిణమిస్తున్నాయని చెప్పక తప్పదు. ఎక్కడికక్కడ వెలుగు చూస్తున్న ఈ అసంతృప్తులు రేవంత్ కు ప్రత్యేకంగా పని పెడుతున్నాయని కూడా చెప్పక తప్పదు.

నిన్నటికి నిన్న పార్టీలో ఓ బలమైన పవర్ గ్రూప్ గా ఉన్న కోమటిరెడ్ది బ్రదర్స్ పై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ ఓ రేంజిలో ఫైరైన సంగతి తెలిసిందే. దళిత ఎమ్మెల్యే అయిన తనకు గౌరవం ఇవ్వకుంటే… కోమటిరెడ్డి బ్రదర్స్ కు చావు డప్పు మోగిస్తానంటూ స్వయంగా సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఇంకా వేడి చల్లారక ముందే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మరో వేడి రాజుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే కూడా ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యం దక్కుతోందని కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజారిటీ దక్కినా… ఆదిలాబాద్ పరిధిలో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఖానాపూర్ లో కాంగ్రెస్ విజయం సాధించగా… మిగిలిన ఆరింటిలో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకోగా… రెండు సీట్లను బీఆర్ఎస్ దక్కించుకుంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ అక్కడి ఏడు నియోజకవర్గాల్లోనూ పర్యటించారు. ఈ పర్యటనల్లో సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకూ అధిక ప్రాధాన్యం దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ నేతలు లోలోపలే మసలిపోతున్నారు.

బీఆర్ఎస్ హయాంలో విపక్షాల ఎమ్మెల్యేలకు అంతగా ప్రాధాన్యమే దక్కలేదు. ఈ నింద తనమీద కూడా ఉండకూడదని భావించిన రేవంత్ రెడ్డి… అదికారిక కార్యక్రమాల్లో విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యం దక్కేలా… ప్రొటోకాల్ మేరకు చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల పుణ్యమా అని విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు…తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల కంటే కూడా ఒకింత ముందు వరుసలో ప్రాదాన్యం దక్కించుకుంటున్నారు. ఇదే తరహా ఇతరత్రా కార్యకలాపాల్లోనూ తమకు ప్రాధాన్యం దక్కేలా చూసుకుంటున్నారు. సీఎం తీరును గమనించిన అధికార యంత్రాంగం కూడా… విపక్షాలకు చెందిన వారైనా ప్రజా ప్రతినిధులుగా వారికి మంచి ప్రాధాన్యం ఇస్తున్నారట.

వెరసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా… తమ నియోజకవర్గాల్లో తాము జీరోలుగా మారిపోయామని ఆ పార్టీ నేతలు సణుక్కుంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో అయితే ఫరవా లేదు గానీ.. ఇతరత్రా కార్యకలాపాల్లో కూడా విపక్షాల నేతలకే ప్రాధాన్యం దక్కితే… ఇక మున్ముందు కాంగ్రెస్ పార్ట బలపడేదెలా? అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని నేరుగా సీఎం ముందే పెట్టేందుకు పలువురు నేతలు యత్నిస్తున్నా… ఆ దిశగా వారి మాట సీఎం దాకా చేరడం లేదన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పాలనలోనూ విపక్షాల నేతల మాటే చెల్లుబాటు అయితే… ఇక మలి ఎన్నికల్లో పార్టీకి ఓట్లు వేయించేది ఎలా? పార్టీకి మరిన్ని సీట్లను దక్కించేది ఎలా? అంటూ వారు ఆవేదనకు గురవుతున్నారు. మరి వీరి ఆందోళన ఏ రీతిన తీరుతుందోనన్న వాదన అయితే ఆసక్తి రేకెత్తిస్తోంది.