ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు వాళ్లకున్నాయి. పెద్దితో ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వెంకట సతీష్ కిలారుకి అవి తొలినాళ్లలోనే అనుభవంలోకి వస్తున్నాయి. రామ్ చరణ్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో భారీ బడ్జెట్ తో పెద్ది తీస్తే అదేమో వాయిదాల మీద వాయిదాలు పడుతూ జూన్ లో మోక్షం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
పెద్ది నిర్మాణంలో రామ్ చరణ్ కంటికి గాయమయ్యింది. చిన్నది కాబట్టి త్వరగా కోలుకుని వెంటనే సెట్స్ కి వచ్చాడు కనక సరిపోయింది కానీ లేదంటే పెద్ది ఇప్పటికీ రిలీజ్ అయ్యుండేది కాదు. సరే జరిగిందేదో జరిగిందనుకుంటే తాజాగా బాలయ్య 111 నిర్మిస్తున్న వెంకట్ సతీష్ కిలారుకి, షూటింగ్ వేగంగా జరుగుతున్న ఆనందానికి సెట్లో జరిగిన యాక్సిడెంట్ వల్ల బ్రేక్ పడింది. అదృష్టవశాత్తు సర్జరీ, విశ్రాంతికి నయమయ్యే గాయం కాబట్టి బాలకృష్ణ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు.
డిసెంబర్ రిలీజ్ అనుకున్న ఎన్బికె 111 ఇప్పుడా డేట్ అందుకోవడం అనుమానమే. సంక్రాంతి చాలా టఫ్ గా ఉంది. అయినా రావడం అంత ఈజీగా లేదు. ఒకవేళ ఈ రెండు స్లాట్స్ మిస్ అయితే 2027 మార్చి లేదా వేసవికి వెళ్లాల్సి ఉంటుంది. బాలయ్యకు కనీసం ఆరు వారాల విశ్రాంతిని డాక్టర్లు రికమండ్ చేశారు. అంటే సెప్టెంబర్ చివర్లోనే షూటింగ్ రీ స్టార్ట్ చేయాలి. ఇంకా చాలా బాలన్స్ ఉంది. కొన్ని ముఖ్యమైన పాత్రలకు అసలు ఎంట్రీనే జరగలేదు.
సో వృద్ధి సినిమాస్ సంస్థకు ద్వితీయ ప్రయత్నంలోనూ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. జరిగేదంతా మంచికే అనుకోవడం తప్ప ఏం చేయలేం కానీ మొత్తానికి ప్యాన్ ఇండియా ప్లాన్స్ తో వచ్చిన వెంకట్ సతీష్ కి తక్కువ టైంలోనే ఎక్కువ పాఠాలు నేర్చుకునే వీలు దొరికింది. బిజినెస్ పరంగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సినిమాలకు వచ్చేటప్పటికీ ఎవరికైనా ఇలాంటి చిక్కులు తప్పవు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
