ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే జరుగుతూ ఉంది. పోస్టర్ మీద ఆ చిత్రం రూ.500 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వేసుకోగా.. ఆ ఫిగర్ ఒరిజినల్ కాదంటూ అప్పట్లో పెద్ద డిస్కషన్ నడిచింది. హిందీ వెర్షన్ మాత్రమే రూ.84 కోట్లు రాబట్టినట్లు చెప్పడమూ అతిశయోక్తిగా అనిపించింది. ఐతే ఈ చర్చ అప్పుడే అయిపోలేదు. ఏళ్ల తరబడి ‘దేవర’ కలెక్షన్ల డిస్కషన్ కొనసాగుతూనే ఉంది. యాంటీ ఫ్యాన్స్ దాని మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ అభిమానులు వారితో గొడవ పడుతూనే ఉంటారు.
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నాగవంశీని ‘దేవర’ వసూళ్ల గురించి నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఆయన దీని మీద ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడింది లేదు. ఐతే ఈ చిత్రాన్ని కొన్ని ఏరియాల వరకు సబ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని రిలీజ్ చేసిన నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘దేవర’ కలెక్షన్ల గురించి మాట్లాడాడు. దేవర ఫైనల్ కలెక్షన్లు ఎంత అన్నది చెప్పలేదు కానీ.. తమ అంచనాలను మించి వసూళ్లు రాబట్టిందని ఆయన స్పష్టం చేశాడు.
‘‘దేవర అన్నది ఒక మిరాకిల్. నేను మూడు ఏరియాల్లో ఆ చిత్రాన్ని రిలీజ్ చేశాను. ఆ మూడు చోట్లా చాలా పెద్ద నంబర్లు వచ్చాయి. మేం ఊహించిన దాని కంటే సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండో వారం నుంచి డౌన్ అయిపోతున్నాయి. ముందు అనుకున్న కలెక్షన్లు రావట్లేదు. కానీ ‘దేవర’ అలా కాదు. నాలుగో వారంలో కూడా చెప్పుకోదగ్గ షేర్ వచ్చింది. ఆ చిత్రానికి అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు వేశాం. వాటి నుంచి కొంచెం డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. ముందు రోజు రాత్రి సెకండ్ షో వేసినా, తెల్లవారుజామున షోలు పడినా ఇబ్బంది ఉండదు.
కానీ అర్ధరాత్రి షో వేస్తే ప్రేక్షకులకు నిద్ర లేక, మైండ్ కొంచెం ఆఫ్ అవడం వల్ల సినిమా సరిగా చూడరు. అందువల్ల డివైడ్ టాక్ వచ్చిందనుకుంటా. అయినా సరే తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని షోలు వేస్తే అన్నీ ఫుల్స్ పడ్డాయి. ఐదు, ఆరు షోలు వేసినా ఫుల్ అయ్యాయి. తర్వాత కూడా సినిమా బాగా ఆడింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను తమ భుజాల మీద మోశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ కావడంతో సినిమాకు లాంగ్ రన్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లుగా మేం అంచనా వేసిన దాని కంటే 50 శాతం ఎక్కువే కలెక్ట్ చేసింది. ఇదంతా ఎన్టీఆర్ గారి పవర్, సినిమాలో ఉన్న కంటెంట్ వల్లే సాధ్యమైంది’’ అని ధీరజ్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

