తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొద్ది నెలలుగా సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన చిన్నాన్న వివేకా హత్య కేసు వ్యవహారంలో జగన్, తన మరో సోదరుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిలను ఎన్నికల ప్రచారం సందర్భంగా షర్మిల తూర్పారబట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇంత హై ప్రొఫైల్ కేసును ఐదేళ్ల పాటు నాన్చిన జగన్…ఓ వైసీపీ కార్యకర్త దారుణ హత్యపై మాత్రం తీవ్రస్థాయిలో రియాక్ట్ కావడంపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతల హత్యలకు నిరసనగా ఏకంగా ఢిల్లీలో ధర్నా చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్న వైనంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీకి హోదా కోసం ఎన్నిసార్లు జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని ప్రశ్నించారు. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? జగన్ గారు అని తన సోదరుడికి షర్మిల చురకలంటించారు. హంతకులతో భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారని జగన్ ను దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను ఐదేళ్ల పాటు పట్టించుకోలేదని, 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు.
కానీ, వైసీపీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అని షర్మిల నిలదీశారు. ఉన్న 11 మంది వైసీపీ సభ్యులూ అసెంబ్లీకి వెళ్లరా అని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం మీకు లేదనుకుంటున్నారా అని షర్మిల వేసిన ప్రశ్నలకు జగన్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.
వినుకొండలో రషీద్ హత్య వ్యక్తిగత కక్ష వల్లేనని పోలీసులు తేల్చారని, హంతకుడు కూడా కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీతోనే ఉన్నారని గుర్తుచేశారు. వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పాలని అనిపించడం లేదా అని జగన్ ను ప్రశ్నించారు. కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఓటు వేస్తేనే మీరు గెలవలేదని, ఐదేళ్ల పాటు ప్రజల కోసం పనిచేయకుండా ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసేందుకు సిగ్గుండాలిని ఫైర్ అయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates