మరో రెండు రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. చంద్రబాబు 45 రోజుల పాలన అనంతరం.. జరుగుతున్న సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. వైసీపీ పాలనలో జరిగిన లోపాలను ఏకరువు పెట్టేందుకు.. అదేవిధంగా శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు కూడా సభ ఇప్పుడు కీలకంగా మారనుంది. ఇప్పటికే చంద్రబాబు కొన్ని శ్వేత పత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలవరం, అమరావతి కీలకమైన శ్వేత పత్రాలు.
ఇక, మిగిలిన శ్వేత పత్రాల్లో ఆర్థిక, శాంతి భద్రతలకు చెందిన శ్వేతపత్రాలను అసెంబ్లీలోనే ప్రవేశ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. వీటిని బట్టి చూస్తే.. సభలో జగన్ టార్గెట్ అవుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. దీనిని ఎంత వరకు పాజిటివ్‌గా తమకు వాడుకుంటారనేది చూడాలి. పదే పదే జగన్‌ను టార్గెట్ చేసినా.. ప్రయోజనం పెద్దగా ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు. సో.. టార్గెట్ ప్రాతిపదికన.. అసెంబ్లీని వాడుకున్నా.. ప్రజలు మరో కోణంలో రిసీవ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది.
ఇక, బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు పూర్తయింది. వచ్చే ఏడు మాసాల కాలానికి చంద్రబాబు ఓటాన్ అకౌంట్ బడ్జట్‌ను పునురుద్ధరించనున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు కొన్ని కీలక పథకాలు ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. మరి వాటికి నిధుల విషయాన్ని ఈ బడ్జెట్లోనే ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇదేసమయంలో అప్పులు-వడ్డీలు.. వంటివాటిని కూడా ఈ బడ్జెట్లో పేర్కొననున్నారు. అయితే.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే వేల కోట్ల అప్పులు చేసింది. మరి వీటిని పారదర్శకంగా పేర్కొంటారా? లేదా అనేది చూడాలి.
జనసేన తీరేంటి?
బడ్జెట్ సమావేశాల్లో జనసేన ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఏమేరకు చంద్రబాబు సర్కారుకు దన్నుగా నిలుస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు సమీక్షలు, సమావేశాలతోనే పవన్ కల్యాణ్ సరిపెట్టారు. ఆయా శాఖలపై ఆయన అధ్యయనం చేసేందుకు ఈ నెల సమయాన్ని వినియోగించుకున్నారు. లోపాలు కనిపెట్టారు. అదేసమయంలో ఆదాయ మార్గాలను కూడా గుర్తించారు. దీంతో ఆయన బడ్జెట్ విషయంలో ఎలాంటి ప్రతిపాదనలతో వచ్చారనేది సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టం కానుంది.