ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ దీక్షను విరమించిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు, నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితులుండేవని, ఆఖరికి ఇళ్లలోని మహిళలపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి ఉందని పవన్ గుర్తు చేసుకున్నారు.
ఒక పార్లమెంటు సభ్యుడిని కస్టడీలో బంధించి కొట్టిన తీరును చూశామని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురించి పవన్ పరోక్షంగా ప్రస్తావించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబును సైతం జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూకుంభ కోణాలకు పాల్పడినందుకే ఈ అరాచక ప్రభుత్వానికి ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పారని పవన్ అన్నారు.
ఇక, తాను ప్రధాని మోడీ పక్కన నిల్చుని ఫోటో దిగాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తాను ప్రధాని మోడీ గుండెల్లో ఉన్నానని పవన్ అన్నారు. జనసేనకు కేటాయించిన మంత్రి పదవులు నిత్యం ప్రజలతో సంబంధం కలిగి ఉండేవని, జనసేన ఎంపీలు కూడా ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తాలని పవన్ దిశా నిర్దేశం చేశారు. అన్ని సమస్యలపై, అంశాలపై అవగాహన పెంచుకోవాలని, విజయం సాధించినా తగ్గి ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలేదని అయ్యన్నపాత్రుడు తనతో అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
వైసీపీ వాళ్లు మనకు ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదని పవన్ చెప్పారు. అయితే, తమకు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చేతకాక కాదని, కానీ అటువంటి చర్యలు ఎవరికి మంచిది కాదన్న ఉద్దేశంతోనే వాటికి దూరంగా ఉండమని చెబుతున్నానని పవన్ అన్నారు. కానీ, వైసీపీ నేతలు చేసిన తప్పులు కూటమి నేతలు చేయకూడదని, వైసీపీ నేతలు చేసిన తప్పులను సహించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ప్రజలు అందరినీ గెలిపించారని, పోటీ చేయని చోట్ల కూడా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసైనికులు, వీర మహిళలు పోరాడారని గుర్తు చేసుకున్నారు.
బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని, పదవి ఆశించకుండా పోరాడిన వారిని మర్చిపోనని చెప్పారు. పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లేందుకు కూడా డబ్బులు లేవని, ఏడిపి ద్వారా నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందని పవన్ చెప్పారు. ఇప్పటివరకు తాను ప్రధాని మోడీని ఏమీ అడగలేదని, కానీ ఇకపై రాష్ట్రం కోసం అడుగుతానని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోడీని కోరుతానని, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు గురించి 25 లక్షల ఉద్యోగాలు కావాలని మోడీ దగ్గర ప్రస్తావిస్తానని పవన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates