ఉప ఎన్నిక‌ల్లో మోడీకి తొలి దెబ్బ‌.

దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మికి తొలి దెబ్బ భారీగా త‌గులుతోంది. అధికారం చేప‌ట్టిన నెల రోజుల్లో వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు, ముఖ్యంగా బీజేపీ ఉప పోరులో వెనుక‌బ‌డి పోగా.. ఇండియా కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శించింది. మొత్తం 13 స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. శ‌నివారం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌ట్టారు. 13 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది.

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజ‌లో ఉన్నారు. మిగతా రెండుచోట్ల ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కొక్క‌ స్థానానికి ఈ నెల 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది.

ఆప్‌కు ఊపిరి: పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మ‌మ‌త త‌గ్గ‌లేదు: పశ్చిమబెంగాల్‌లోని మానిక్‌తలా, బాగ్దా, రాణాఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌గంజ్‌.. మొత్తం నాలుగు స్థానంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ దూకుడు: హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రా అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ ముందంజలో ఉన్నారు. నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా..ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, మంగలౌర్‌.. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరన్‌ షా ముందంజలో ఉన్నారు.

కూట‌మి రెండు స్థానాల్లో: బిహార్‌లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా హమీర్‌పుర్‌లో బీజేపీ నేత ముందంజలో ఉన్నారు. ఇక‌, తమిళనాడులోని విక్రావండిలో ఇండియా కూట‌మిలోని త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే నేత అన్నియుర్‌ శివ ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. మోడీ నేతృత్వంలోని ఎన్డీయేకి ఇబ్బందిగా మార‌నుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.