దేశంలో ఎమర్జెన్సీ.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ.. ఇప్పటికీ చరిత్రలో ఒక పాఠంగా ఉండిపోయిం ది. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చి.. భావప్రకటన, వాక్ స్వాతంత్ర్యం వంటివాటిని చిదిమేసిన రోజులు అవి. ఈ రోజులు.. చరిత్రలో కలిసిపోలేదు. ఒక పాఠంగా నిలిచిపోయాయి. తరచుగా తెరమీదికి వస్తూనే ఉన్నాయి. నాటి చీకటి రోజులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల 18వ పార్లమెంటు సమావేశాల తొలి రోజునే రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌లు ఈ ఎమర్జెన్సీని కేంద్రంగా చేసుకుని ప్రసంగించిన విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు ఈ ఎమర్జెన్సీని ‘అధికారికం’ చేస్తూ.. మోడీ సర్కారు కాంగ్రెస్ పార్టీని మరింత టార్గెట్ చేసింది. 1975లో విధించిన ఎమర్జెన్సీకి.. ప్రస్తుతం 50 ఏళ్లు నడుస్తున్నాయి. జూన్ 25వ తేదీన అప్పట్లో ఇందిరమ్మ ఎమర్జెన్సీని విధించారు. దీనిని గుర్తు చేస్తూ.. నిరంతరం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న మోడీ ఆయన పరివారం.. ఇప్పుడు ఈ రోజును ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక, నుంచి ప్రతి ఏటా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు.. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఏకేయనున్నారు!
“1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిర తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు” అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇది నిజమే. తన పాలనను, నిర్ణయాలను ప్రశ్నించిన వారిని ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారు. ఎమర్జెన్సీ బాధితులు కాని వారు లేరంటే అప్పట్లో ఆశ్చర్యం వేస్తుంది. పత్రికల గొంతు నులిమారు. మీడియా స్వేచ్ఛను కూడా హరించారు. ఈ నేపథ్యంలో ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను ‘రాజ్యాంగ హత్య దివస్’గా నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.
ఆ రోజు ఏం చేస్తారు?
+ ఇక నుంచి ప్రతి ఏటా జూన్ 25న దేశవ్యాప్తంగా నల్ల జెండాలతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తారు. నిరసన వ్యక్తం చేస్తారు.
+ పాఠశాలలు, కళాశాలల్లో నాటి ఎమర్జెన్సీపై లెక్చర్లు ఇస్తారు. విద్యార్థులకు ఇందిరమ్మ వ్యవహారాలను పూసగుచ్చినట్టు చెబుతారు.
+ ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
+ తద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత కోలుకోకుండా.. చేయడమే మోడీ లక్ష్యంగా కనిపిస్తోంది.
అసలేంటీ ఎమర్జెన్సీ.. ఎందుకు వచ్చింది?
+ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అల్లర్లు చెలరేగినప్పుడు.. రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించే అధికారం ఉంది. అయితే.. ఇది ఏ ఒక్క వ్యక్తి కోసం కాకూడదు. సమాజం కోసం.. దేశం కోసం.. మాత్రమే దీనిని వినియోగించాలి.
+ అయితే.. 1975, జూన్ 25న ఇందిరమ్మ తనకు అన్యాయం జరిగిందనే కారణంగా ఏకపక్షంగా దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దీనిని ప్రశ్నించిన వారిని జైళ్లలోకి నెట్టారు. లాఠీ చార్జీలు చేశారు. ఆస్తులు లాక్కున్నారు. పత్రికా కార్యాలయాలకు తాళాలు వేశారు. ఎడిటర్లను, సిబ్బందిని కూడా నిర్బంధించారు.
+ యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఇందిరమ్మ ఎన్నికయ్యారు. అయితే..అవకతవకల ద్వారా ఆమె ఎన్నికయ్యారంటూ.. ప్రత్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు.. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్న కీలక షరతు తో కూడిన స్టే ఇచ్చింది. అంటే ఆమె ఎన్నికను ఆహ్వానించింది.
+ అంతే.. ఆ వెంటనే ఇందిరమ్మ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.