ఆమె ఫస్ట్ టైం పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కానీ, ముదురు షరతులు పెడుతున్నారు. నియోజకవర్గం లో ప్రజలు తనను కలసి సమస్యలు చెప్పుకొనేందుకు వస్తే.. ముందుగా వారి ఆధార్ కార్డును అడ్రస్‌ను చూపించాలని ఆమె షరతులు విధించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. నటి.. కంగనా రనౌత్.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆమె పోటీలో ఉన్న సమయంలోనే వివాదాలకు కేంద్రంగా మారారు. ఇక, ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు.. తనను కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే.. రెండు షరతులు ఖచ్చితంగా పాటించాలని రనౌత్ తేల్చి చెప్పారు.
1) తనను కలిసేందుకు వచ్చేవారు ఆధార్ లేదా అడ్రస్‌ను ధ్రువీకరించే పత్రాలు తీసుకురావాలి.
2) ఏ సమస్య అయినా నోటితో చెప్పడం కాదు.. లిఖిత పూర్వకంగానే ఇవ్వాలి. ఈ రెండు షరతులకు లోబడి మాత్రమే.. తనను కలిసేందుకు రావాలని తేల్చి చెప్పారు.
‘హిమాచల్ ప్రదేశ్ కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల మండి ప్రాంతం నుంచి వచ్చే వారు ఆధార్ కార్డులు తీసుకురావడం తప్పనిసరి. నియోజకవర్గ పనులకు సంబంధించిన వివరాలను కూడా కాగితంపై తీసుకురండి. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటూ కంగనా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరిన్ని షరతులు…
- నియోజకవర్గంలోని ఉత్తర ప్రాంత ప్రజలు మనాలీలోని ఇంటికి వచ్చి ఫిర్యాదులు చేయాలి. ఎక్కడబడితే అక్కడ ఫిర్యాదు చేయరాదు.
- మండి పట్టణంలోని ప్రజలు కూడా ఆఫీసుకు రావాలి. వ్యక్తిగతంగా కలిసేవారు.. ఆధార్ ఇవ్వాలి. అయితే.. కంగనా వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందాయి. మరి ఏం చేస్తారో చూడాలి.