హ‌రీష్‌కు చెక్‌.. కేటీఆర్ పాద‌యాత్ర!

బీఆర్ఎస్ పార్టీలో నెంబ‌ర్ 2గా భాసిల్లుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌.. పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న వార్త‌లు హోరెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ప్లాన్ అంతా రెడీ అయింద‌ని.. రోడ్డు మ్యాప్ కూడా రెడీ అయింద‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. అన్నీ కుదిరితే వ‌చ్చే శ్రావ‌ణ మాసం నుంచే మాజీ మంత్రి కేటీఆర్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతార‌ని తెలుస్తోంది. బాస‌ర లోని స‌ర‌స్వ‌తీ ఆల‌యం నుంచి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నార‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి జిల్లా, ప్ర‌తి మండ‌లం, ప్ర‌తి గ్రామం మీదుగా.. ఆయ‌న పాద‌యాత్ర సాగ‌నుంద‌ని తెలుస్తోంది.

కేటీఆర్ చేప‌ట్ట‌నున్న సుదీర్ఘ పాద‌యాత్ర వ‌చ్చే మూడున్న‌రేళ్ల‌పాటు నిర్విఘ్నంగా సాగుతుంద‌ని కూడా బీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న మాట‌. ఈ యాత్ర బాస‌ర‌తో ప్రారంభ‌మై.. భ‌ద్రాద్రిలోని రామ‌య్య ఆల‌యం వ‌ద్ద ముగుస్తుంద‌ని.. ఈ మేర‌కు రోడ్డు మ్యాప్‌ను కూడా రెడీ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌తి వ‌ర్గాన్ని, ప్ర‌తి కులాన్నీ.. తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల‌ను కూడా కేటీఆర్ క‌లుస్తార‌ని తెలిసింది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ఆయ‌న పంచుకోనున్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే 2028 ఎన్నిక‌ల నాటికి క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. పార్టీని అదికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా “అడుగులు” ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

అస‌లు ల‌క్ష్యాలు ఇవీ!

ఊర‌క‌రారు.. మ‌హాను భావులు.. అన్న‌ట్టుగానే కేటీఆర్ కూడా ఊరికేనే ఈ యాత్ర చేప‌డుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే మూడున్న‌రేళ్ల‌లో ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నేది పైకి క‌నిపిస్తున్న ల‌క్ష్య‌మే. కానీ, వాస్త‌వ ల‌క్ష్యం వేరేగా ఉంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీ ప‌గ్గాల విష‌యంలో త‌న‌కు అడ్డంకిగా ఉన్న హ‌రీష్‌రావును ప‌క్క‌కు తప్పించే వ్యూహం ఉండి ఉంటుంద‌ని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ వ‌య‌సు ముదురుతోంది. మ‌హా అయితే.. మ‌రో నాలుగేళ్లు ఆయ‌న యాక్టివ్‌గా ఉంటారు.

త‌ర్వాత కేసీఆర్‌ను వృద్ధాప్య స‌మ‌స్య‌లు వెంటాడుతాయి. దీంతో పార్టీ ప‌గ్గాల‌ను వ‌దులుకోవాలి. ఈ విష‌యంలో హ‌రీష్‌రావు.. పోటీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్‌.. చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డం కూడా.. ఆయ‌న ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. అలానే.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రూపుల‌ను ప్రోత్స‌హించార‌న్న అప‌ప్ర‌ద‌ను ఎదుర్కొన్న కేటీఆర్‌.. ఇప్పుడు అంద‌రికీ చేరువ అవ్వాల‌నేది కూడా.. మ‌రో కీల‌క వ్య‌వ‌హారం. అందుకే ఉభ‌య కుశ‌లోప‌రిగా ఆయ‌న పాద‌యాత్ర‌ను ఎంచుకున్నార‌ని.. ఇవ‌న్నీ.. క‌నిపించ‌ని ల‌క్ష్యాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.