ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చాలామంది అంచనా వేశారు కానీ.. ఆ పార్టీ మరీ 11 సీట్లకు పరిమితం అవుతుందని మాత్రం అనుకోలేదు. బాగా పని చేశారు అని పేరున్న ఎమ్మెల్యేలు సైతం చిత్తయి పోవడం ఆశ్చర్యం కలిగించింది. అలా ఆశ్చర్యపరిచిన ఫలితాల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానిది ఒకటి. ఇక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాగా పని చేశాడని చాలామంది చెబుతుంటారు. సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. రోజూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ జనాల్లోకి వెళ్లి కేతిరెడ్డి సమస్యలు తెలుసుకునే వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఆయన ఓటమి గురించి అందరూ ఆశ్చర్యపోయారు.
స్వయంగా కేతిరెడ్డి తాను ఎంతో మంచి చేసినా ఎందుకు ఓడిపోయానో తెలియదంటూ బాధపడ్డాడు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కేతిరెడ్డి ఓటమి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడం తెలిసిందే.
ఐతే ధర్మవరం నుంచి కేతిరెడ్డి మీద విజయం సాధించిన బీజేపీ నేత సత్యకుమార్.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేతిరెడ్డి ఓటమి గురించి మాట్లాడారు. కేతిరెడ్డి రెండో కోణం గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలకపలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో మీరు తెలంగాణలో నడిపిన భూ మాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ భకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే’’ అని పేర్కొన్నారు.
నిజానికి చెరువును భారీ స్థాయిలో ఆక్రమించి పెద్ద ఫాం హౌస్ కట్టుకున్నాడని కేతిరెడ్డిపై ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇంకా ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ వీటిని మించి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి చేపట్టిన కార్యక్రమం పాపులర్ అయి.. ఆయన ఓటమిపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates