ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది ట్రైల‌రే.. సినిమా ముందుందంట‌..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? కేవలం సమస్యలు తెలుసుకుని వదిలేస్తున్నారా? ఆయా శాఖల‌లో ఏం జరుగుతోంది? ఆయా శాల‌ఖలో ఆర్థిక పరిస్థితి ఏంటి? అని తెలుసుకుని మౌనంగా కూర్చున్నారా? ఇదీ ఇప్పుడు జరుగుతున్న చర్చ. కానీ, ఆయనకు నాలుగు శాఖలు ఇచ్చారు. పంచాయతీరాజ్‌, అట‌వీ శాఖ, శాస్త్ర సాంకేతిక విభాగాలను కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఇవి తనకు నచ్చిన శాఖలని, తన మనసును హత్తుకున్న శాఖలని గతంలోనే అని చెప్పారు. దీంతో ప్రతి శాఖలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నారు.

దీన్ని బట్టి ఆయన మున్ముందు ఏం చేయాలో నిర్ణయించుకునే అవకాశం, విశాలమైన కార్యాచరణ, ఆచరణాత్మక దృక్పథంతో ముందుకు సాగే అవకాశం ఉంది. కానీ నెలరోజులు అయిపోయినా ఎట్లాంటి సంచలన‌ నిర్ణయం తీసుకోలేదని, ఆయన శాఖలో ఎలాంటి మార్పులు జరగలేదని పెద్ద ఎత్తున చర్చ‌ అయితే జరుగుతోంది. దీనిని జనసేన నాయకులు కూడా ఖండించలేకపోతున్నారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అధికారుల‌ను మార్చేశారు, అదే విధంగా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే గనుల శాఖ, కీలకమైన రెవెన్యూ శాఖలో మార్పు చేర్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు డిప్యూటీ సీఎంగా కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి సంచలన నిర్ణయాలు ఏవి ఇప్పటివరకు తీసుకోలేదు. అయితే ముందు ముందు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పటివరకు జరిగిందని గమనిస్తే ఆయన ట్రైలర్ దశలోనే ఉన్నారని, విషయాలు తెలుసుకుంటున్నారని స్పష్టం అవుతుంది. ప్రతి శాఖలోనూ సమస్యలు ఉన్నాయని, వాటిని తెలుసుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో అనేది మునుముందు చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం ఒకింత పవన్ కళ్యాణ్ పనితీరును చర్చించేలా చేస్తుంది. దీనికి ఆయన ఏవిధంగా ఫుల్ స్టాప్ పెడతారు. ఎలాంటి నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్నది ట్రైలర్, మునుముందు ఆయన అసలు విశ్వరూపాన్ని చూపించే అవకాశం ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.