బాబు గారూ… విశాఖ టీడీపీకి దిక్కెవరండీ?

తెలుగు దేశం పార్టీ… ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే పేరెన్నికగన్న పార్టీ కిందే లెక్క. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా బక్కచిక్కిపోయింది. ప్రత్యేకించి జిల్లాలకు జిల్లాల్లోనూ తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు విశాఖ జిల్లాపైనా ఎంతో కొంత పట్టు ఉందన్న వాదనలు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటాయి.

అయితే ఇప్పుడు ఈ జాబితా నుంచి విశాఖ కూడా జారిపోయిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు విశాఖ టీడీపీకి ఇప్పుడు ఓ దిక్కంటూ ఉందా? అన్న మాటలు కూడా మరింత ఆసక్తికరమేనని చెప్పాలి. అసలు విశాఖ టీడీపీని బతికించగలిగే నాథుడు, ఆ శాఖ తరఫున గొంతెత్తి మాట్లాడే నాయకుడే లేకుండా పోయాడన్న వాాదనలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లు మినహా జిల్లాలోని ఏ ఒక్క స్థానాన్ని కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఇక జిల్లాలోని మూడు ఎంపీ సీట్లను కూడా వైసీపీ ఎగురవేసుకుపోయింది. ఇక గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మొత్తంగా ఇప్పుడు విశాఖ జిల్లాలో టీడీపీకి మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. వారిలో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దాదాపుగా సైలెంట్ అయిపోయారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో విశాఖతూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమే ఒకింత లైమ్ లైట్ లో ఉన్న నేత. అయితే పెద్దగా నాయకత్వ లక్షణాలేమీ ఆయనలో కనిపించవు. ఇక మిగిలిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఉన్నా ఒకటే… లేకపోయినా ఒకటేనన్న చందంగా వ్యవహరిస్తుంటారు.

సరే… ఈ నలుగురిని పక్కనపెడితే… మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగిన బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఎందుకనో గానీ మౌనముద్ర దాల్చేశారు. ఏ విషయంపైనా ఆయన నోరు కూడా విప్పేందుకు సిద్ధంగా లేరు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించడం లేదు. పార్టీ సీనియర్ గా కొనసాగుతున్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో పోరాటం సాగిస్తున్నా… ఆయనది ఒంటరిపోరుగానే కనిపిస్తోంది. ఇక బండారు సత్యనారాయణ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదన్న వాదనలే వినిపిస్తున్నాయి. మొత్తంగా విశాఖ టీడీపీ బాధ్యతను భుజానికెత్తుకునే నేతే కనిపించడం లేదు. అంటే… విశాఖ టీటీడీపీకి ఇప్పుడు దిక్కూ మొక్కూ లేకుండా పోయిందన్న మాట.