“పార్టీ ఓడిపోయినప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారు. రూల్స్ గుర్తుకు వచ్చాయి. న్యాయం, చట్టం అంటూ ఉన్నాయన్న విషయం కూడా గుర్తుకు వచ్చింది. అదేదో అధికారంలో ఉన్నప్పుడే గుర్తు పెట్టుకుని ఉంటే.. బాగుండేది”- ఇదీ.. ఇతమిత్థంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనాల నుంచి వినిపిస్తున్న మాట. ఐదేళ్ల అధికారం అయిపోయిన తర్వాత.. అనూహ్య ఓటమిని చవి చూసిన తర్వాత.. ఆయనకు పై వన్నీ గుర్తుకు వస్తున్నాయని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం తన సొంత జిల్లా కడపలో జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆయన కడపలోనే ఉండనున్నారు.
అయితే.. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా స్థానిక ప్రజలను జగన్ కలుస్తున్నారు. వారి నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. వాస్తవానికి మాజీ సీఎంగా జగన్.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో సమస్యలు ఉండవని భావించారు. అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. పదవులు కూడా ఇచ్చారు. సో.. ఆయనకు తన సొంత నియోజకవర్గంలో అసలు సమస్యలు ఏముంటాయిలే అని కూడా అనుకుని ఉంటారు. కానీ, ప్రజలు ఇప్పుడు తండోపతండాలుగా ఆయన చుట్టూ చేరుతున్నారు. తమకు పథకాలు అందలేదని.. తాము అర్హులమైనా.. తీసేశామని వందల సంఖ్యల ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇదేసమయంలో స్థానిక నేతల దూకుడుపైనా కొందరు క్షేత్రస్థాయిలో నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జగన్ ఒకింత ఉలిక్కి పడే పరిస్థితి ఎదురవుతోంది. ఇలా.. జరిగిందా! అని ఆయన ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. జగన్ సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక, వేరే వారి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. సో.. ఇప్పుడు ప్రజల ఆవేదన విన్న తర్వాత.. వారి ఆక్రోశం గమనించిన తర్వాత.. ఎక్కడ తప్పు జరిగింందో.. ఎలా ఓటమి చెందామో.. ఆయనకు అర్ధమై ఉంటుంది.
కానీ, ఇప్పటికే సమయం గడిచి పోయింది. ఇప్పుడు అర్జీలు తీసుకుని.. విన్నపాలకు సంబంధించిన పత్రాలు తీసుకుని ఏం చేయగలరు. సభలో పోరాటం చేద్దామంటే వెళ్తారో లేదో కూడా తెలియదు. పోనీ.. ఆయా సమస్యలు.. ప్రతిపక్షం హయాంలో జరిగాయా? అంటే అది కూడా కాదు. తన ఏలుబడిలోనే జరిగిన అన్యాయాలు. దీంతో జగన్‌కు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో కూడా తెలియని స్థితి నెలకొంది. ఆ నాడే ప్రజా దర్బార్‌లు నిర్వహించి.. ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టి ఉంటే.. బాగుండేదని, అధికారం కోల్పోయాక.. పదవి చేజారాక.. పరిస్థితి ఇలా ఉందా? అని వగచి ఏం ప్రయోజనం అంటున్నారు.