చక్కగా కట్టుకుంటున్న ఇంటిని చిందర వందర చేయడం.. పీకేసి పందిరేయడం.. ఈ రెండింటికీ నిలు వెత్తు ఉదాహరణ ఏపీ రాజధాని అమరావతి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ మైలేజీలను కొలుచుకుని.. నాటి సీఎం జగన్ చేసిన నిర్వాకంతో ఇప్పుడు.. అమరావతి పరిస్థితి అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు అమరావతి అంటే.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ.. ఇప్పుడు పిలిచినా వస్తారనే నమ్మకం లేకుండా పోయింది. జగన్ చేసిన నిర్వాకంతో రాజధాని పరిస్థితి తలకిందులైంది.
ఈ నేపథ్యంలో రాజధానిని ఎలా పరుగులు పెట్టించాలన్న విషయంపై మంత్రి నారాయణ సహా.. అధికారులు తలబాదుకుంటున్నారు. ఈ క్రమంలో 8 వేలకుపైగా ఎకరాల భూమిని తాకట్టు పెట్టేందుకు రెడీ అయ్యారు. రాజధాని పరిధిలో కీలకమైన భాగంలో ఉన్న 8274 ఎకరాల భూమిని తాకట్టు పెట్టడం ద్వారా.. రాజధాని నిర్మాణానికి ప్రాథమికంగా నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది.
రాజధాని పరిధిలో ఉన్న భూమి 53,748 ఎకరాలు. దీనిలో రైతులు ఇచ్చింది.. 34 వేల ఎకరాలు. మిగిలినది .. అటవీ భూములను డీ నోటిఫై చేసి తెచ్చుకున్నారు. సో.. రైతులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. దీనికి ప్రభుత్వమే ఖర్చు చేయాల్సి ఉంది. అదేసమయంలో రోడ్లు ఇతర సదుపాయాల కోసం 27,885 ఎకరాలు, రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు 11,826 ఎకరాలు, ఇతర అవసరాల కోసం 14,037 ఎకరాలు కేటాయించాలి.
ఇవి పోగా మిగిలిన 8 వేల ఎకరాలను తాకట్టు పెట్టుకుని తద్వారా వచ్చే ఆదాయం వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. అయితే.. మనుగడలో ఉన్న భూమికి ఉండే విలువ.. ప్రస్తుత మూలనపడిన రాజధాని ప్రాంతానికి ఉంటుందా? అనేది ప్రశ్న. ఈ నేపథ్యంలో ముందుగా. .. కేటాయించిన సంస్థలను పిలిచి.. కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వారిని ప్రోత్సహించాలన్నది సర్కారు యోచన.
తర్వాత.. ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉద్యోగులకు వసతి ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు నిర్వహించేలా చేయాలన్నది మరో ఆలోచన. తద్వారా.. రాజధాని ప్రాంత మనుగడ పెరిగి.. అప్పు పుట్టే అవకాశం ఉంటుందన్నది బాబు సర్కారు వ్యూహం. మరి ఏమేరకు సాకారం అవుతుందో చూడాలి. ఏదేమైనా.. జగన్ చేసిన పని.. రాజధానికి పెద్ద డ్యామేజీనే మిగిల్చిందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates