బెజవాడలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. విజయవాడలోని అవనిగడ్డకు వెళ్లే కరకట్టపై కొందరు బస్తాల కొద్దీ ఫైళ్లను తీసుకువచ్చి.. తగుల బెట్టారు. అయితే .. ఈ ఘటన జరిగిన సమయం.. సదరు ఫైళ్లను పరిశీలిస్తే.. గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు వెలుగు చూడకూడదన్న ఉద్దేశంతోనే.. ఇలా చేసి ఉంటారనే అనుమానాలు రేగుతున్నాయి. ఈ ఫైళ్లను తగుల బెడుతుండగా చూసిన ఓ వ్యక్తి.. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగింది?
జగన్ హయాంలో గనుల శాఖలో దోపిడీ జరిగిందనే విషయంపై ప్రస్తుత చంద్రబాబు సర్కారు కూపీ లాగుతోంది. ఎక్కడెక్కడ ఎవరెవరికి గనులు ఇచ్చారు.? తద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత? దోచుకుంది ఎంత? అనే విషయంపై చంద్రబాబు ప్రభుత్వం అంతర్గత విచారణ చేయిస్తోంది. ఇదే సమయంలో ఇసుక రీచ్‌ల వ్యవహారం కూడా.. తెరమీదికి వచ్చింది. ఇసుక రీచ్‌లను తన వారికి కేటాయించుకున్న జగన్.. వాటి వల్ల.. దొడ్డిదారిలో తాను సంపాయించుకున్నారని గతంలోనే టీడీపీ నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సదరు దోపిడీని నిగ్గు తేల్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా జగన్ హయాంలో గనుల శాఖ మంత్రిగా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు. ఈయన కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. కాగా.. ఇప్పుడు అంతర్గత విచారణ ప్రారంభమైన.. రెండు రోజుల వ్యవధిలోనే.. భారీ సంఖ్యలో ఫైళ్లను .. విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై తగులబెట్టడం.. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను చూసి.. తగుల బెడుతున్న వారు.. పరారవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది.
ఇక, తగులబెడుతున్న ఫైళ్లలో కొన్నింటిని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వాధీనం చేసుకున్నారు. వీటి పై అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలు ఉన్నాయి. అదేవిధంగా అప్పటి గనుల శాఖ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ ఫొటోలు, సంతకం కూడా ఉన్నాయి. దీంతో టీడీపీ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ఫైళ్లను తగుల బెట్టడం వెనుక.. ఖచ్చితంగా అక్రమార్కులు తప్పించుకునే వ్యూహం ఉందని ప్రాథమికంగా సర్కారు అవగాహనకు వచ్చింది. దీనిపై మరింత లోతైన విచారణ జరపాలంటూ.. సీఐడీని ఆదేశించింది. కాగా, జగన్ అధికారం కోల్పోయిన తర్వాత.. కూడా ఇలానే అమరావతి ప్రాంతానికి చెందిన కొన్ని ఫైళ్లను తగుల బెట్టిన విషయం తెలిసిందే.