హైద‌రాబాద్‌తో ఈక్వ‌ల్‌గా వ‌రంగ‌ల్‌..

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు.. రియ‌ల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్ర‌ధాన న‌గ‌రాల‌ను అభివృద్ది చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌లు రెడీ చేస్తున్నారు. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించిన రేవంత్‌రెడ్డి.. వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని.. హైద‌రాబాద్ న‌గ‌రంతో స‌మానంగా అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించినట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా.. పెట్టుబ‌డులు.. రియ‌ల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయ‌ని ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. గ‌తంలో బీఆర్ ఎస్ హ‌యాంలో రూపొందించిన వరంగల్ మాస్టర్‌ప్లాన్‌ను స‌మూలంగా మార్పు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ – 2050ని రూపొందించాలన్నారు. మ‌రీ ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్‌ సిటీ పథ‌కాల‌ను వేగంగా అమ‌లు చేయ‌డంపైనా దృష్టి పెట్టారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వేగంగా ముందుకు సాగాల‌న్నారు. త‌ద్వారా హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాల‌ని సూచించారు. సాంస్కృతిక న‌గ‌రంగా వరంగల్ ను అభివృద్ది చేయ‌డం ద్వారా.. ప‌ర్యాట‌క, హోట‌ల్ రంగాల‌కు న‌గ‌రం ఆతిధ్యం ఇస్తుంద‌ని పేర్కొన్నారు.

ఎందుకు?

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా వరంగ‌ల్‌పై ఫోక‌స్ చేయ‌డం వెనుక‌.. ఏముంద‌నేది ఆసక్తిగా మారింది. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌రంగ‌ల్ జిల్లా బీఆర్ ఎస్‌కు గ‌ట్టిప‌ట్టుగా మారిన విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో బీజేపీ కూడా ఇక్క‌డ పుంజుకుంటోంది. ఈ రెండు ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయంగా చైత‌న్య‌వంత‌మైన ఈ జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చుకునేందుకు రేవంత్ ఇలా.. అభివృద్ది వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో వ‌రంగ‌ల్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మొత్తాని రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్ – 2050 ఏమేరకు స‌క్సెస్ అవుతుందో చూడాలి.