ఏపీ రాజధాని అమరావతిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. అనంతరం.. రెండో పర్యటనను అమరావతిలోనే చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో శాశ్వత భవనాలను నిర్మించేందుకు కార్యాచరణను రూపొందించడమే కాకుండా.. వాటిని గుర్తించాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఆర్‌డీఏ అధికారులు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించిన స్థలాలను గుర్తించడంతోపాటు.. 1575 ఎకరాల ప్రాంతాన్ని కేటాయిస్తూ.. నోటిఫై చేసింది.
వాస్తవానికి 2018లోనే శాశ్వత భవనాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పునాదులు వేసింది. ఇదే విషయాన్ని ఎన్నికల్లోనూ ప్రచారం చేసుకుంది. కానీ.. 2019లో ప్రజలు వైసీపీకి పట్టంకట్టడంతో ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు అమరావతిని పరుగులు పెట్టించాలని నిర్ణయించిన దరిమిలా.. పునాదుల స్థితిలో ఉన్న శాశ్వత భవనాల ను పూర్తి చేయాలని సంకల్పించింది. అదేసమయంలో మరికొన్ని సర్కారు కాంప్లెక్స్ భవనాలను కూడా నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేయాలని సీఆర్ డీఏకు ఇటీవల చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాంప్లెక్స్ కోసం 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్‌డిఎ తాజాగా నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం దీనిని గుర్తించడం గమనార్హం. ఈ స్థలాలు రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్నాయి. ఇప్పటికి సచివాలయం, హైకోర్టు నిర్మించినా.. అవి తాత్కాలిక భవనాలేనని అప్పట్లోనే ప్రకటించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ వంటి శాశ్వత భవనాలను ఇక్కడ నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు ఆ పనిపైనే చంద్రబాబు సర్కారు దృష్టి పెట్టింది. ఫలితంగా అమరావతి నిర్మాణాలు వచ్చే ఎన్నికల నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.