ఏపీలోని కూటమి ప్రభుత్వం.. వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. గత వైసీపీ ప్రభుత్వం పని చేసిన తీరు.. అదేవిధంగా అమలు చేసిన పథకాలు.. తీసుకువచ్చిన నిధులు.. అప్పులు వంటివి పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదేపదే.. ఈ విషయాలను చర్చించారు. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం అయ్యేలా చేశారు.
అయితే.. ఈ విషయంలో వైసీపీ వేళ్లు టీడీపీవైపు చూపిస్తున్నాయి. మరో నెల రెండు నెలల్లో వైసీపీ నేతలు రోడ్డెక్కనున్నారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదు. ఎన్నికలకు ముందు మాత్రం తమపై విష ప్రచారం చేస్తున్నారని ప్రజలకు చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైట్ పేపర్ రూపంలో ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏడు శాఖలకు సంబంధించిన వైట్ పేపర్లను చంద్రబాబు విడుదల చేయనున్నారు. వీటి లో పోలవరం, అమరావతి, ఆర్థికం, పర్యావరణం, గనులు, అప్పులు వంటివి ఉన్నాయి. ఆయా శాఖల్లో వైసీపీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. చేసిన పనులను చంద్రబాబు వివరిస్తారు. జగన్ తీసుకున్న తలా తోక లేని నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల పాలైందని బాబు వివరించే ప్రయత్నం చేస్తారు. ఈవిషయంలో సందేహం లేదు. అయితే.. వాస్తవానికి ఇప్పుడు మంచిదేనా? అన్నది ప్రశ్న.
దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి.. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇది తెలంగాణలో జరిగింది. మరి ఈ విషయం తెలిసి కూడా..చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? అనేది రెండో కోణం. ఎందుకంటే.. ఇలా ఉన్న పరిస్థితిని తాను చక్కదిద్దేందుకు తాను ప్రయత్నిస్తానని ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని చెప్పేందుకు కూడా.. ఈ వైట్ పేపర్ ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.