ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాటతీరు చిత్రంగా ఉంటున్నాయి. ఓవైపు 40 శాతం జనం ఇంకా మనవైపే ఉన్నారు అంటూనే.. ఇంకోవైపు ఈవీఎంల హ్యాకింగ్ అంటూ ఆరోపణలు చేశారు.
గతంలో ఈవీఎంల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలనే గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఆయన్ని ఒక ఆట ఆడుకున్నారు నెటిజన్లు. అధికారంలో ఉన్నపుడు మాట్లాడిన మాటలకు, చేసిన చేతలకు.. ఇప్పుడు స్పందిస్తున్న తీరుకు పొంతన ఉండట్లేదని ఆయన్ని రాజకీయ ప్రత్యర్థులే కాక సామాన్య జనాలు కూడా తప్పుబడుతున్నారు. తాజాగా జగన్.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ స్పీకర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఇందులో ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఒక ప్రణాళిక ప్రకారమే ఈ పని చేశారని అనిపిస్తోంది.
అసెంబ్లీలో మొత్తం సభ్యుల్లో వైసీపీకి పది శాతం ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఆయన కోర్టుకు వెళ్లినా, ఇంకో ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేనట్లే. ఈ విషయం జగన్‌కు కూడా తెలియంది కాదు. కానీ ఆయన కావాలనే ఈ లేఖ రాశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాను అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేదని ఇంతకుముందు పార్టీ నేతల సమావేశంలో జగన్ వ్యాఖ్యల్ని బట్టే అర్థమైంది. 151 మంది సభ్యులతో అసెంబ్లీలో అంతులేని అధికారాన్ని అనుభవించాక జగన్‌కు అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లదని.. ఆయన సమావేశాల్లో పాల్గొనరని రఘురామకృష్ణంరాజు లాంటి నేతలు ముందే అంచనా వేశారు. జగన్ తీరు చూస్తే అదే జరగబోతోందనిపిస్తోంది. కానీ అసెంబ్లీకి రాకపోవడానికి ఏదో ఒక కారణం చూపించే జనాల్లోకి వెళ్లాలి. అందుకే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, సభలో అవమానించారని జనాలకు చెప్పుకోవాలి. తద్వారా కొంత సానుభూతి రాబట్టాలి. ఈ కారణం చూపి ఇంకెప్పుడూ అసెంబ్లీకి వెళ్లకుండా మానుకోవాలి. అందుకే అధికార పార్టీని, స్పీకర్‌ను తప్పుబడుతూ ఒక లేఖ రాసి.. ఈ అంశాన్ని జగన్ ఒక సాకుగా వాడుకుని అసెంబ్లీకి దూరమయ్యే ప్లాన్ వేశారని విశ్లేషకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates