ఏపీ ప్రెస్ అకాడ‌మీ.. ఇక‌పై ‘రామోజీ’ ప్రెస్ అకాడ‌మీ? !

మీడియా మొఘ‌ల్‌, ఈనాడు సంస్థ‌ల అధినేత‌, రామోజీ ఫిలిం సిటీ రూప‌క‌ర్త రామోజీరావుకు ఘ‌న నివాళులు అర్పించేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్న‌ద్ద‌మైంది. ఈ నెల 27న ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌కు ఘ‌నంగా సంస్మ‌ర‌ణ స‌భ‌ను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టిపెరిగిన‌.. కృష్ణాజిల్లాలోనే ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రూ. 5 కోట్ల ను విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులు కొలుసు పార్థ‌సార‌థి, కొల్లు ర‌వీంద్ర స‌హా.. మ‌రికొంద‌రు స‌మ‌న్వయం చేసుకుంటున్నారు.

ఇక‌, రామోజీ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ స‌హా .. పాత్రికేయులు.. ఇత‌ర రంగాల ప్ర‌ముఖులు.. ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రువుతున్నారు. ఈ నేప‌థ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా క‌ట్టుదిట్టం చేశారు. వీవీఐపీలకు, సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి గ్యాలరీకి ఇంఛార్జీలను నియమించారు. ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బారికేడింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వెన్యూ రహదారులు మరమ్మతులు చేస్తున్నారు. మొత్తంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి అదే రేంజ్‌లో ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అయితే.. ఇప్ప‌టికే రామోజీ రావు జ్ఞాప‌కాలు తెలుగు వారితోనూ.. తెలుగు నేల‌తోనూ చిర‌స్థాయిగా గుర్తుండిపోయేలా.. ఏర్పాట్లు చేస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

ఏపీ ప్రెస్ అకాడ‌మీ పేరును ఆయ‌న ‘రామోజీ ప్రెస్ అకాడ‌మీ’గా మార్చే ఆలోచ‌న చేస్తున్నట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాజ‌ధాని అమ‌రావ‌తి పేరును ఆయ‌నే సూచించిన నేప‌థ్యంలో అమ‌రావ‌తి ప్రాంతంలోనూ రామోజీ విగ్ర‌హానికి స్థ‌లాన్ని కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. దీనిపై చంద్ర‌బాబు కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిలో రామోజీ స్మార‌కం నిర్మిస్తామ‌న్నారు. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు కూడా.. ఈ నెల 27న నిర్వ‌హించే సంస్మ‌ర‌ణ స‌భ‌లో నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.