ఆ ఆరుగురు ఎవరు ? .. కొత్త మంత్రుల కొట్లాట !

లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. గత డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పేరుతో ప్రతి పనికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది.

ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో ఇప్పుడు అందరిదృష్టి మంత్రి పదవుల మీద పడింది. డిసెంబరులో 12 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోగా మరో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రులయ్యే ఆ ఆరుగురు ఎవరు అన్న ఉత్కంఠ మొదలయింది.

ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ముదిరాజ్ లకు మంత్రి పదవి అని ప్రకటించాడు. మహబూబ్ నగర్ ఎంపీ గెలిస్తే జిల్లాకు చెందిన వాకిట శ్రీహరికి అవకాశం అన్నాడు. అయితే స్వల్పతేడాతో అక్కడ ఓటమి ఎదురయింది.

భువనగిరిలో గెలిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అన్నారు. అక్కడ గెలిచిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభిస్తుందా ? ఇద్దరు సోదరులకు సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి, గ్రేటర్ కోటాలో దానం నాగేందర్ కు మంత్రి పదవులు ఖాయమని అంటున్నారు. అయితే ఇటీవల కంటోన్మెంట్ నుండి గెలిచిన తనకు అవకాశం ఇవ్వాలని శ్రీగణేష్ అడుగుతున్నట్లు తెలుస్తుంది.

రంగారెడ్డి జిల్లా కోటాలో మల్ రెడ్డి రంగారెడ్డి సీనియర్ నేతగా పదవి ఆశిస్తున్నాడు. బలమైన యాదవ సామాజికవర్గం నుండి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పదవి ఆశిస్తూ కులసంఘాలతో డిమాండ్ చేయిస్తున్నాడు.

ఇక ఆదిలాబాద్ కోటాలో వివేక్ వెంకటస్వామికి ఖాయం అని అంటున్నారు. మరోవైపు మాదిగ, లంబాడా సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఒక డిమాండ్ తీవ్రంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్న ఆరు మంత్రి పదవులతో ఎంత మందిని సంతృప్తి పరచగలరు అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పదవులు ఇస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయి అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.