ఉమ్మడి గుంటూరు జిల్లా శివారు ప్రాంతమైన తాడేపల్లిలో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన(తుది దశకు చేరుకుంది) వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తాజాగా అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణమని.. అనుమతులు లేకుండా నిర్మించారని పేర్కొంటూ.. శనివారం తెల్లవారు జామున ఈ నిర్మాణాన్ని నేల మట్టం చేశారు. పైగా వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఈఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మ క సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అని జగన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
భిన్న స్పందన!
ప్రస్తుతం జరిగిన కూల్చివేతల పర్వంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ ప్రజావేదికను కూల్చేశారు కాబట్టి.. ఇప్పుడు తాము కూడా.. కూల్చివేతలతోనే పని ప్రారంభిస్తాం.. అన్నట్టుగా టీడీపీ పని చేస్తోందా? అని కొందరుప్రశ్నించారు. మరికొందరు మాత్రం.. అక్రమంగా నిర్మించుకున్న దానిని కూల్చేస్తే తప్పేముందని అంటున్నారు. ఇంకొందరు నోటీసులు ఇచ్చి.. సమయం కేటాయించి.. ప్రజల్లోకి ఈ అక్రమాన్ని తీసుకువెళ్లి.. అప్పుడు కూల్చి ఉంటే.. బాగుండేదని అంటున్నారు. ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.