జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు?

ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తాము ఏం తప్పులు చేశామో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం.. పరిస్థితులకు తగ్గట్లుగా తాము మార ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టడం చాలా అవసరం. 2019లో చిత్తుగా ఓడాక తెలుగుదేశం, జనసేన ఆ పని చేశాయి.

వైసీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ తాము చేయాల్సిన పోరాటమంతా చేశాయి. ఐతే ఇప్పుడు వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జగన్ అండ్ కో వ్యవహారశైలి చూస్తుంటే.. ఇంకా ఆత్మస్తుతి పరనింద తరహాలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్‌తో మొదలుపెడితే.. లేటెస్ట్‌గా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూసి అందరూ విస్తుబోతున్నారు.

తన పాలనలో వైఫల్యాలు, తప్పిదాల ఊసే ఎత్తకుండా తాను చాలా గొప్పగా పరిపాలించినా, అద్భుతాలు చేసినా జనాలు ఓడించడం ఏంటి అనే ఆయన ఆవేదన చెందుతున్నారు. తాను మరీ ముక్కుసూటిగా ఉండడం, నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అంటూ నిష్ఠూరాలు ఆడారు.

ఐతే జగన్ ఇలా తనకు తాను ఉత్తముడినంటూ నాటకీయంగా మాట్లాడ్డం.. తెర వెనుక ఆయన చేతలు, ఆ పార్టీ నేతల వ్యవహారం వేరుగా ఉండడం, పాలన అస్తవ్యస్తంగా, అరాచకంగా తయారవడం వల్లే వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందన్నది వాస్తవం.

ఈ ఫలితాలు చూశాక అయినా మారాల్సింది పోయి జగన్ అనే నాటకీయతను కొనసాగిస్తూ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మరోవైపు కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్లు కొన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు తమ పాత శైలిలోనే ఎదురుదాడి, దుందుడుకుతనంతో మాట్లాడుతుండడం చూసి జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు, వీళ్లింతే అనే అభిప్రాయాలను జనం వ్యక్తం చేస్తున్నారు.