ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ మోస్ట్ నాయకుడు, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అయ్యన్న రేపు బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. తాజాగా 175 మంది ఎమ్మెల్యేల్లో 172 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. జీవీ ఆంజనేయులు(వినుకొండ) వనమాడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ(ఆచంట నియోజకవర్గం) వివిధ కారణాలతో సభకు రాలేదు.
దీంతో సభకు హాజరుకాని వారితో శనివారం ప్రొటెం స్పీకర్ గా ఉన్న బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిం చనున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. దీనికి సంబంధించి అసెంబ్లీ సెక్రటేరియెట్ కార్యదర్శి రామాచారికి టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు నామినేషన్ పత్రాలను అయ్యన్న తరఫున సమర్పించారు. వీరిలో బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, టీడీపీ మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్‌లు ఉన్నారు.
తామంతా ఏకగ్రీవంగా అయ్యన్నకు స్పీకర్‌గా మద్దతు ఇస్తున్నట్టు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే.. ఈ రోజు సాయంత్రం వరకు ఎవరైనా నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలలోపు.. ఏ ఎమ్మెల్యే అయినా.. తాను కూడా స్పీకర్‌గా ఉంటానంటూ.. పోటీలోకి దిగి.. నామినేషన్ పత్రాలు సమర్పిస్తే.. శనివారం ఉదయం ఓటింగ్ పెడతారు. లేక పోతే.. అయ్యన్నను ఖరారు చేస్తూ.. ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారు.
గతంలో ఒక సారి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు.. ప్రతిపక్షం నుంచి కూడా.. ఒకరు స్పీకర్ పదవి కోసం నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కానీ..ఇప్పుడు ప్రతిపక్షమే లేక పోవడం.. కూటమి పార్టీలన్నీ ఏకతాటిపై ఉండడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయన వచ్చే ఐదేళ్లు స్పీకర్‌గా ఉంటారు.
ఏంటి బెనిఫిట్?
- కేబినెట్ హోదా దక్కుతుంది.
- మంత్రి వచ్చే శాలరీ ఎంత ఉంటుందో అంతే మొత్తం స్పీకర్‌కు వుంటుంది.
- గౌరవ లాంఛనాలు అందుతాయి.
- ఎక్కడికి వెళ్లినా.. ఆయనకు విమానం సహా..ఫస్ట్ క్లాస్ సౌకర్యాలు ఉచితం.
- నలుగురు పీఏలను ఇస్తారు. ఎక్కడ బస చేసినా.. ప్రభుత్వమే బిల్లు కడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates