చంద్ర‌బాబుకు కేంద్రం మిఠాయి.. అమ‌రావ‌తిపై కీల‌క నిర్ణ‌యం!

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ల‌లు కంటున్న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో కీల‌క ఘ‌ట్టాని కి కేంద్రం అనుమ‌తి తెలిపింది. రాజ‌ధాని ప్రాంతాన్ని కీల‌క‌మైన గుంటూరు, విజ‌య‌వాడ‌, ప్ర‌కాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాల‌కు క‌లుపుతూ.. నిర్మించే రైల్వే లైన్ల‌కు కేంద్ర స‌ర్కారు తాజాగా ప‌చ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్ర‌బాబు శుక్ర‌వారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యం లోనే కేంద్రం నుంచి ఈ స‌మాచారం అంద‌డం విశేషం.

న‌వ న‌గ‌రాల‌తో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రాజ‌ధానిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దాల‌ని చంద్ర‌బాబు సంక‌ల్పించిన విష‌యం తెలిసిందే. అయితే.. ముందుగా.. ప్ర‌ధాన న‌గ‌రాలైన‌.. గుంటూరు, విజ‌య‌వాడ‌, ఒంగోలు వంటి ప్రాంతాల‌కు.. ఈ న‌గ‌రాన్ని అనుసంధాన్ని చేయాల్సి ఉంటుంది. కేవ‌లం రోడ్డు మార్గ‌మే కాకుండా.. రైలు లైను కూడా వేయాల‌న్న‌ది చంద్ర‌బాబు బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌.. దీని ప్ర‌కార‌మే ఆయ‌న 2017-18లో నే ఈ ప్ర‌ణాళిక‌ల‌ను కేంద్రానికి అందించారు.

అయితే.. త‌ర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మ‌ధ్య వివాదం త‌లెత్త‌డంతో ఇది ఆగిపోయింది. త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప‌ట్టించుకోలేదు. దీంతో తాజాగా కూట‌మిగా కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు అమ‌రావ‌తి ప్లానును.. రైల్వేకు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలోనే రైల్వే శాఖ‌.. అమ‌రావ‌తి నూత‌న లైన్ల‌కు సంబంధించి.. ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఇవీ.. ప్ర‌తిపాదిత‌ లైన్లు..

  • విజయవాడ, గుంటూరుల‌లోని ప్ర‌ధాన రైల్వే లైన్లతో అమరావతిని క‌లుప‌నున్నారు.
  • హైద‌రాబాద్ రూట్‌లో ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 56.53 కిలో మీటర్ల మేర డబుల్ లైన్
  • అమరావతి – పెదకూరపాడు(గుంటూరు) మధ్య 24.5 కి.మీ సింగిల్ లైన్‌
  • సత్తెనపల్లి – నరసరావుపేట మధ్య 25 కి.మీల సింగిల్ లైన్ నిర్మించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైల్వే శాఖ‌కు ప్ర‌తిపాదించింది.

అనుమ‌తులు ఇవీ..

  • ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైన్ స్థానంలో తొలుత సింగిల్ లైన్ నిర్మాణానికి కేంద్రం ఓకే.
  • దీనికిగాను కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయ‌నున్నాయి.
  • ఈ రైల్వే లైన్ విజయవాడ – హైదరాబాద్ లైన్‌లో ఎర్రుపాలెం దగ్గర మొదలై.. అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడ లైన్‌లోని నంబూరు దగ్గర కలుస్తుంది.
  • కృష్ణా నదిపై కొత్తపేట – వడ్డమాను మధ్య 3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఓకే.
  • ఇత‌ర ప్ర‌తిపాదిత రైల్వే లైన్ల‌కు కేంద్రం అంగీకారం. ప‌నుల‌పై రాష్ట్రంతో త్వ‌ర‌లోనే చ‌ర్చ‌.