ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన యాత్రల్లో పలుప్రాంతాల్లో ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. దీంతో తాము అధికారంలోకి రాగానే.. ఆయా ప్రాంతాలను పరిశీలించి కొత్త జిల్లాల ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు.. ముసాయిదా జిల్లాల ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం 26 జిల్లాలుగా ఉన్న ఏపీని .. 32 జిల్లాల రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ముసాయిదా రెడీ చేసింది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా అసెంబ్లీ లో నూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి.. పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేందుకు కొంత సమయం పడుతుం ది. అయితే.. ముసాయిదా ప్రకటనను బట్టి.. మరో 6 జిల్లాలను కొత్తగా చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేయనుంది.
ఇవీ.. కొత్త జిల్లాలు..
మదనపల్లె జిల్లా: పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్ల పల్లె నియోజకవర్గాలతో నూతన జిల్లా.
పలాస జిల్లా: ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి.
రాజమండ్రి జిల్లా: అనపర్తి, రాజానగరం,రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాలు ఉంటాయి.
అమరావతి జిల్లా: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.
మార్కాపురం జిల్లా: ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి.
రాజంపేట జిల్లా: బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.
గమనిక: ఇది.. ముసాయిదా మాత్రమే.. ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత.. ప్రభుత్వం అధికారికంగా జిల్లాల ఏర్పాట్లపై నిర్ణయం ప్రకటించనుంది. కాగా. 2014లో ఏపీ విభజన తర్వాత.. 2021లో అప్పటి జగన్ ప్రభుత్వం 13 జిల్లాలు ఉన్న ఏపీని పార్లమెంటు నియోజకవర్గం వారీగా 25 జిల్లాలకు విభజన చేసింది. అయితే.. అరకు పార్లమెంటుస్థానం పెద్దది కావడంతో రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని 32 జిల్లాలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates