వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ విషయంపై తేల్చి చెప్పారు. తన పార్టీ నాయకులు, ఓడిన, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా అనే అంశంపై సుదీర్ఘంగా వారితో చర్చించారు. కొందరు వెళ్దామని.. కొందరు వద్దని ఇలా తమకు నచ్చిన విధంగా నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారు. చివరకు జగన్‌కే నిర్ణయం వదిలేశారు. కాగా.. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు.
వీరిలోనూ జగన్ ఒకరు. మిగిలిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా గెలిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్లి ప్రమాణం మాత్రమే చేసి రావాలని నాయకులకు తేల్చి చెప్పారు. తాను కూడా వస్తానన్నారు. అయితే.. తర్వాత నుంచి సభలకంటే కూడా.. ప్రజలకు చేరువ కావాలని అన్నారు. అయితే.. సభలకు వెళ్లాలా? వద్దా అనే విషయంపై ఎవరికివారు నిర్ణయించుకోవాలని సూచించారు.
తాను ఎవరినీ వద్దని కానీ.. వెళ్లమని కానీ చెప్పబోనని జగన్ అన్నారు. అయితే.. ప్రజలే ముఖ్యమని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లినా మైక్ ఇవ్వరు. పైగా హేళన చేస్తారు. ఇవన్నీ భరించడం అవసరమా? మీ ఇష్టం. వెళ్లేవాళ్లను వద్దని చెప్పను. వెళ్లమని కూడా.. నేను చెప్పను. మీ ఇష్టం. వెళ్తేకానీ.. బాగుండదని కొందరు అంటున్నారు. అది మీ ఇష్టానికే వదిలేస్తున్నా. నేను ప్రజల మధ్యకు వెళ్తాను. ప్రజలతోనే ఉంటాను. మన వాయిస్ ప్రజల మధ్యే వినిపిస్తే.. బాగుంటుందని నేను అనుకుంటున్నా అని జగన్ వ్యాఖ్యానించారు.
దీంతో జగన్ మాటను జవదాటని వారంతా.. తాము కూడా.. అసెంబ్లీకి వెళ్లకూడదని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదిలావుంటే.. కాకినాడ నుంచి పోటీ చేసి ఓడిపోయి చెలమల శెట్టి సునీల్.. ఈ సమావేశానికి రాలేదు. అదేవిధంగా మరికొందరు కూడా గైర్హాజరయ్యారు. దీంతో వారి విషయంపైనా చర్చించారు. దీనిపై జగన్ ఆసక్తిగా స్పందించారు. ఎవరి ఇష్టం వారిది. నేనేమీ అడ్డుపడను అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కొందరు ఓడిపోయిన తర్వాత.. పొరుగు పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates