వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్రకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన మనసులో మాటను పార్టీ కీలక నాయకులకు వివరించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, గెలిచిన నాయకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిరాశలో కూరుకుపొయిన నాయకుల్లో ఆయన ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.
ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్న జగన్.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చిందన్నారు. కేంద్రం సహా.. పవన్ కల్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని చెప్పారు. అందుకే వైసీపీ ప్రభుత్వ మంచి కార్యక్రమాలపైనా బురదజల్లారన్నారు. ప్రజలను నమ్మకంగా వంచిచారని జగన్ వ్యాఖ్యానించారు. తాను త్వరలోనే ఓదార్పు యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు.
పార్టీ ఓటమి తర్వాత.. వైసీపీ కార్యకర్తల కుటుంబాలపై అనేక దాడులు జరిగాయని, అనేక మందిని చంపేశారని.. వారి వారి కుటుంబాలను తాను కలిసి సాయం చేయాలని భావిస్తున్నట్టు జగన్ చెప్పారు. దీనికి పార్టీలో కీలక నాయకులు అందరూ ఓకే చెప్పారు. తాము కూడా.. తమ తమ నియోజకవర్గాల్లో యాత్రకు సిద్ధమవుతామని వారు చెప్పగా.. కొంత సమయం తీసుకోవాలని.. చంద్రబాబు పాలనకు కూడా.. టైం ఇవ్వాలని.. అప్పుడు యాత్రలు చేయాలని జగన్ సూచించారు.