ఏపీలోని చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చీ రావడంతోనే.. ఐఏఎస్ అధికారులను మార్చేసిన చంద్రబాబు.. తాజాగా రాష్ట్ర పోలీసు బాస్.. డీజీపీ విషయంలోనూ సంచలన అడుగులు వేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్‌కుమార్ గుప్తాను పక్కన పెడుతూ.. నూతన డీజీపీగా ద్వారకాతిరుమల రావును ఎంపిక చేసింది. వాస్తవానికి హరీష్‌కుమార్ గుప్తాను మార్చబోరన్న సంకేతాలు ఆదిలో వెలువడ్డాయి. ఎందుకంటే.. ఈయనను కేంద్ర ఎన్నికల సంఘమే ఎంపిక చేసింది.
దీంతో ఆయనే ఉంటారని అందరూ అనుకున్నారు. మరో రెండున్నరేళ్ల వరకు ఆయనకు అవకాశం ఉంది. అయితే.. అనూహ్యంగా చంద్రబాబు ఆయనను పక్కన పెడుతూ.. ద్వారకా తిరుమలరావును నియమించారు. ప్రస్తుతం ఈయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. గత జగన్ ప్రభుత్వం ఈయనను ఆర్టీసీకి నియమించింది. అయితే.. ఇలా ద్వారకా తిరుమల రావును అనూహ్యంగా డీజీపీని చేయడం వెనుక కారణాలు ఏంటనేది ఆసక్తిగా మారింది.
నిజాయితీ పరుడైన అధికారిగా ద్వారకా తిరుమలరావుకు పేరుంది. ముఖ్యంగా చంద్రబాబుహయాంలో ఆయన సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి.. తన సమర్థతను నిరూపించుకున్నారు. ఆర్టీసీ ఎండీగా కూడా.. రవాణా వ్యవస్థలో కీలకమైన ప్రజారవాణాను గాడిలో పెట్టారు. పైగా పోలీసు వ్యవస్థను ఆధునీకరించడంలోనూ ఆయన గుర్తింపు పొందారు. దీంతో చంద్రబాబు తన స్పీడుకు అనుగుణంగా ఈయనను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, ఎన్నికల సంఘం నియమించిన హరీష్‌కుమార్ గుప్తా.. 50 రోజుల పాటు డీజీపీగా ఉన్నారు. అయితే.. ఆయన వచ్చిన తర్వాత కూడా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలు సజావుగా సాగలేదనే వాదన ఉంది. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా.. ముగ్గురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురికావడంతో సర్కారుపై విమర్శలు వచ్చాయి. దీనికి తోడు.. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన రోజు.. ట్రాఫిక్ నియంత్రణలోనూ పోలీసులు విఫలమయ్యారు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates