వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అత్యంత నష్టపోయిన.. దారుణమైన అవమానాలు, కష్టాలు అనుభవించిన ప్రాంతం ఏది అంటే మరో మాట లేకుండా అమరావతి అని చెప్పేయొచ్చు. ఎన్నికలకు ముందు వరకు అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నాం, రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి.. అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్ అండ్ కో చేయని ప్రయత్నం లేదు.
ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారి వాళ్లు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్ట కాలంలో అమరావతి రైతులకు అండగా నిలిచి, వారి కోసం గట్టిగా గళం వినిపించిన నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకడు. అప్పుడు ఆయన చేసిన సాయానికి ఇప్పుడు అమరావతి రైతులు రుణం తీర్చుకునే పనిలో పడ్డారు.
ఎన్నికల్లో గెలిచి మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. తొలిసారి అమరావతిలోని సచివాలయానికి వస్తున్నారని తెలిసి రాజధాని రైతులు హర్షాతిరేకం ప్రకటించారు. పవన్‌ను స్వాగతించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. అమరావతిలో వాహనం దిగిన దగ్గర్నుంచి పవన్‌ను రోడ్డు మీద నడిపించకూడదని స్థానికులు ఫిక్సయ్యారు. అందుకే వందల టన్నుల్లో పూలు తెప్పించారు. పవన్ నడిచే రోడ్డంతా పూలతో నింపేస్తున్నారు. అలాగే పవన్ మీద కూడా పూలు చల్లేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతే కాక పవన్ కోసం భారీ గజమాల కూడా రెడీ చేశారు.
ఇక్కడ పవన్ ప్రయాణం ఒక విజయయాత్ర లాగా సాగబోతున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక రైతులు మీడియాతో మాట్లాడుతూ.. తమను ఏ నాయకులూ కలవకుండా ముళ్లకంచెలు అడ్డుగా పెట్టారని.. వాటిని కూడా దాటుకుని వచ్చి పవన్ తమకు మద్దతు పలికారని.. ఆయన రుణం తీర్చుకోలేనిదని.. అందుకే ఈ ఏర్పాట్లు అని చెప్పారు.