ష‌ర్మిల‌కు ప్ర‌మోష‌న్‌.. రెడీ అయిందా?!

ఏపీ పీసీసీ చీఫ్‌.. మాజీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నుందా? ఆమె సేవ‌ల‌కు గుర్తుగా.. మ‌రింత బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నుందా? ఆమెను గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌విలోకి పంప‌నుందా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సోమ‌వారం ష‌ర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులు.. సోనియాగాంధీ, రాహు ల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌ను క‌లుసుకున్నారు. వారి నివాసానికి వెళ్లిన ష‌ర్మిల‌.. సుమారు రెండుగంట‌ల పాటు వారితో చ‌ర్చించారు. అనంత‌రం.. గ్రూప్ ఫొటో దిగారు.

దీనికి సంబంధించి ష‌ర్మిల త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌తో భేటీ అయ్యాయ‌న‌ని.. అనేక అంశాల‌పై చ‌ర్చించుకున్నామ‌ని తెలిపారు. ముఖ్యంగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌లు, త‌ద్వారా.. పార్టీ బ‌లోపేతం అవుతున్న తీరును వారికి వివ‌రించిన‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బ‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగింద‌ని, రాబోయే రోజుల్లో మ‌రింత ప‌టిష్టంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపైనా తాముచ‌ర్చించామ‌న్నారు.

“భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం సంపాదించుకోవడమే కాదు ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడనున్నాయన్న విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను” అని షర్మిల త‌న ఎక్స్ ఖాతాలో వివరించారు.

అస‌లు విష‌యం వేరే!

అయితే.. ఈ క్ర‌మంలో అస‌లు విష‌యం వేరేగా ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. త‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ద‌రిమిలా.. ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాల‌ను ష‌ర్మిల‌కు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో ఆమె చెల‌రేగి మ‌రీ పార్టీ కోసం ప‌నిచేశారు. అన్న జ‌గ‌న్ స‌ర్కారును గ‌ద్దెదించుతాన‌న్న ప్ర‌తిజ్ఞ‌ను నిల‌బెట్టుకున్నారు. త‌ద్వారా.. కాంగ్రెస్ పార్టీ ఓట్ల‌ను వైసీపీ నుంచి దూరం చేసి.. త‌మ‌కు చేరువ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంగా గ‌త 2019లో 1 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పుడు 2.28 శాతానికి చేరింది. దీంతో గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ష‌ర్మిల‌కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చే విష‌యంపైనా సోనియా గాంధీ చ‌ర్చించిన‌ట్టు తెలిసిందే. వ‌చ్చే నెల‌లో నాలుగు రాజ్య‌స‌భ స్తానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక దానిని ష‌ర్మిల‌కు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు దిశానిర్దేశం చేసిన‌ట్టు స‌మాచారం.