టీటీడీ డిక్లరేషన్ లో అసలేముంటుంది?

ఏ మాత్రం అవసరం లేని విషయం ఒకటి.. ఇప్పుడు వివాదంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఇరుకున పడేసేలా చేసింది. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి అన్నారో అనలేదో కానీ.. ఆయన పేరుతో మీడియాలో వచ్చిన వార్తల సారాంశం ప్రకారం.. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా వచ్చింది. ఇది కాస్తా వివాదంగా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పలేదని.. గతంలో సోనియా.. వైఎస్ లు డిక్లరేషన్ లు ఇవ్వలేదని మాత్రమే తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నిత్యం స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది వస్తుంటారని.. అందులో వివిధ మతాల వారు ఉంటారని.. అందరిని డిక్లరేషన్ ఇవ్వాలని తప్పనిసరిగా అడగలేం కదా? అని మాత్రమే తాను మాట్లాడినట్లుగా ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించే వ్యక్తి హైందవ సంప్రదాయాలకు పెద్దపీట వేయటంతో పాటు.. వారి మత విశ్వాసాల్ని కాపాడే వారై ఉండాలి. విశ్వాసాల అమలుకు మినహాయింపుల్ని కలలో కూడా దరికి చేరనివ్వకూడదు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇంతకూ అన్య మతస్తులు స్వామివారి దర్శనం చేసుకోవటానికి టీటీడీ అధికారులకు ఇచ్చే డిక్లరేషన్ లో ఏముంటుందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. బ్రిటీష్ హయాం నుంచి అన్య మతస్తులు ఎవరైనా స్వామివారి దర్శనానికి వస్తే.. డిక్లరేషన్ ఫారాల మీద సంతకాలు చేసే సంప్రదాయం ఉండేదని చెబుతున్నారు. 1933 మందు వరకు మహంతుల పర్యవేక్షణలో టీటీడీ వ్యవహారాలు సాగేవి. తర్వాత టీటీడీకి ప్రత్యేకంగా కమిషనర్ ను నియమించారు. అప్పటినుంచి వారే అన్ని విషయాల్ని పర్యవేక్షిస్తుంటారు.

ఇతర మతాలకు చెందిన వారు స్వామివారి దర్శనానికి వస్తే.. వారి చేత డిక్లరేషన్ తీసుకునేవారు. దీనికి సంబంధించి 1990 ఏప్రిల్ 11న అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం టీటీడీ ఆలయాలు.. హిందూ దేవాలయాల్ని హిందువులు తమ హక్కుగా భావిస్తారు. ఇతర మతస్తులు టీటీడీ ఆలయాల్ని దర్శించుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకుంటే దర్శన సమయంలో మాత్రం డిక్లరేషన్ సమర్పించుకోవాల్సిందేనని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు.

టీటీడీ 136వ నిబంధన ప్రకారం స్వామి వారి దర్శనాన్ని కోరే అన్య మతస్తులు.. తమ పేరు.. మతాన్ని పేర్కొంటూ శ్రీ వేంకటేశ్వరస్వామిపై తనకు నమ్మకం ఉందని.. గౌరవం ఉందని అందువల్ల దర్శనానికి అనుమతించాలని పేర్కొంటూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ను టీటీడీకి చెందిన పేష్కార్ కు సమర్పించుకోవాలి. వారి అనుమతి ఇచ్చాక మిగిలిన భక్తులతో పాటుగా దర్శనం చేసుకునే వీలుంది.