జ‌గ‌న్ అందుకే ఓడిపోయాడు: రాజా సింగ్

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయిన విష‌యం తెలిసిందే. క‌వేలం 11 స్థానాల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మై.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక పోయింది. అస‌లు అసెంబ్లీకి వెళ్తారో లేదో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

ఘోర ప‌రాభ‌వం ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా ప్ర‌జ‌లకు మొహం చూపించ‌లేక పోతున్నారు. ఇక‌, మాజీ సీఎం జ‌గ‌న్ మాత్రం విడ‌త‌ల వారీగా .. త‌న వారితో భేటీ అయి.. కొంత మేర‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాము ఓడిపోయినా భ‌య‌ప డాల్సిన ప‌నిలేద‌ని.. ప్ర‌జ‌లు 40 శాతం ఓట్లు త‌మ‌కే వేశార‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎందుకు కూలిపోయిందో ఆయ‌న విశ్లేషించారు. ఈ మేర‌కు ఆయ‌న సెల్ఫీ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

తొలుత ఆయ‌న నూత‌న ముఖ్య‌మంత్రి, టీడీపీ సార‌థి.. చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం.. జ‌గ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు సంధించారు. ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌ను అన్య మ‌త ప్ర‌చారానికి వాడుకున్నార‌ని వ్యాఖ్యానించారు. క‌న్వ‌ర్టెడ్ క్రిస్టియ‌న్ల చేతిలో తిరుమ‌ల‌ను పెట్టి స్వామివారిని, స్వామి వారి భ‌క్తుల‌ను కూడా క్షోభ‌కు గురి చేశార‌ని రాజాసింగ్ అన్నారు.

తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్ నుంచి ఈవో వ‌ర‌కు అంద‌రినీ క‌న్వ‌ర్టెడ్ క్రిస్టియ‌న్ల‌ను నియ‌మించార‌ని రాజా సింగ్ తెలిపారు. అంతేకాదు.. మ‌ద్యం, మాంసాల‌ను కూడా.. తిరుమ‌ల‌పైకి అనుమ‌తించి..తిరుమల ప‌విత్ర‌త‌కు తీవ్ర భంగం క‌లిగించార‌ని అందుకే స్వామి క‌న్నెర్ర చేశార‌ని.. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ కుప్ప‌కూలిపోయింద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని తాను గతంలోనే ఒక‌సారి హెచ్చ‌రించిన‌ట్టు రాజాసింగ్ తెలిపారు.

ప్ర‌స్తుతం ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అయినా.. తిరుమ‌ల ప‌విత్ర‌త‌త‌ను కాపాడాల‌ని.. అన్య‌మ‌త‌స్తుల‌కు చోటు లేకుండా.. చూడాల‌ని ఆయ‌న విన్న వించారు. హిందూ మ‌త‌స్తుల‌కే ఉద్యోగాలు.. ప‌ద‌వులు ఇవ్వాల‌ని అన్నారు.