ర‌ఘురామ‌, అయ్య‌న్న‌, బుచ్చ‌య్య‌, ధూళిపాళ్ల‌కు కీల‌క ప‌ద‌వులు!

టీడీపీ సీనియ‌ర్లు స‌హా.. తాజా ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి విజ‌యం ద‌క్కించుకున్న ముఖ్య నాయకుడు.. ర‌ఘురామ‌కృష్ణ రాజుకు కూడా.. సీఎం చంద్ర‌బాబు ముఖ్య ప‌ద‌వులు ఇచ్చేందుకు చూస్తున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గ కూర్పు పూర్త‌యింది. మ‌రో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో చంద్ర‌బాబు రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు. ప్ర‌తి సోమ‌వారం ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించేందు కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

దీంతో ఈలోగానే కీల‌క ప‌ద‌వుల‌ను పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో మిగిలిన కీల‌క ప‌ద‌వుల‌ను కూడా ఇచ్చేసేందుకు రెడీ అయ్యారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు, మాజీ మంత్రి, న‌ర్సీప‌ట్నం నుంచి విజ‌యంద‌క్కించుకున్న చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడికి అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌వివ‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని మాత్రం జ‌న‌సేన నేత‌.. పంతం నానాజీకి కేటాయించే అవ‌కాశం ఉంది. ఈ దిశ‌గా వారి వివ‌రాల‌ను చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్నారు.

అదేవిధంగా పార్టీలో మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు.. మంత్రి ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డిన బుచ్చ‌య్య చౌద‌రికి కూడా.. మ‌రో కీల‌క ప‌ద‌విని అప్ప‌గించే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఆయ‌న‌కు రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చే అవ‌కాశం ఉంది. తెలుగు భాష‌పై బుచ్చ‌య్య‌కు ఉన్న ప‌ట్టు.. అనేక కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఈ ప‌ద‌విని ఇచ్చే దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు. ఇక‌, పొన్నూరు ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు ధూళిపాళ్ల న‌రేంద్ర చౌద‌రికి చీఫ్ విప్‌గా ప‌ద‌విని కేటాయించారు. ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

అలానే వైసీపీ నుంచి టీడీపీలోకివ‌చ్చి ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ర‌ఘురామ కు రాష్ట్ర ప్లానింగ్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గిస్తున్న‌ట్టు తెలిసింది. రాష్ట్ర అభివృద్దిలో ఈ పాత్ర కీల‌క‌మ‌నే విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఈయ‌న స్పీక‌ర్ ప‌ద‌విని ఆశిస్తున్నారు. కానీ, బీసీ వ‌ర్గాల‌కు గ‌తంలో వైసీపీ స్పీక‌ర్ ప‌ద‌విని అప్ప‌గించింది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా.. అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కు ప్లానింగ్ క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించ‌నున్నారని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.