టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ బృందానికి శాఖలు అప్పగించారు. వీటిలో కీలకమైన శాఖలను కొన్నింటిని మాత్రం తనవద్దే పెట్టుకున్నారు. వీటిలో సాధారణ పరిపాలన శాఖ అత్యంత కీలకం. గతంలో దీనిని ఆయన వద్దే పెట్టుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా ముఖ్యమంత్రులు దీనిని వేరే వారికి ఇస్తుంటారు. కానీ.. సాధారణ పరిపాలనను కట్టడి చేసేందుకు.. మంత్రులు, నేతలు, అదికారుల దూకుడును నియంత్రించేందుకు ఈ శాఖను ముఖ్యమంత్రి వద్దే పెట్టుకోవడం మంచిదనే అభిప్రాయం ఉంది.
ఇక, హోం శాఖలోని కీలకమైన విభాగం శాంతి భద్రతలు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందు కు.. పోలీసు యంత్రాంగాన్ని నియంత్రించేందుకు ఈ విభాగమే కీలకం. దీనిని కూడా చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు. అయితే.. హోం శాఖలోని కొన్ని విభాగాలను మాత్రం మహిళా మంత్రి వంగలపూడి అనితకు కేటాయించారు. గతంలో వైఎస్ కూడా.. సబితా ఇంద్రా రెడ్డికి హోం శాఖ ఇచ్చారు. కానీ .. శాంతి భద్రతలను మాత్రం తనవద్దే ఉంచుకున్నారు.
ఇక, జగన్ పాలనలోనూ.. ఇద్దరు ఎస్సీ మహిళా మంత్రులకు హోం శాఖలు ఇచ్చినా.. కీలకమైన శాంతి భద్రతలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయంపై ముఖ్యమంత్రికి పట్టు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పనిచేశారు. అదేవిధంగా మంత్రులకు కేటాయించిన పలు శాఖలను కూడా.. చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు. దీనిలో శాసన సభ వ్యవహారాలను కూడా చంద్రబాబు తనవద్దే ఉంచుకున్నారు. మొత్తంగా .. చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.