ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. త్వరలోనే మళ్లీ ప్రజాబాట పట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ నెల 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. నిజానికి ఇది 2019 ఎన్నికల ఫలితంతో పోల్చుకుం టే ఘోర పరాభవం. అప్పట్లో 151 సీట్లు రాగా.. ఇప్పుడు 11కు పరిమితం అయిపోయింది. దీంతో పార్టీని గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం జగనకు వచ్చింది.
తాజాగా ఆయన గత నాలుగు రోజుల నుంచి ప్రాంతాల వారీగా ఓడిపోయిన నాయకులను పిలిపించుకుని తన క్యాంపు కార్యాలయాన్నే పార్టీకార్యాలయంగా మార్చుకుని చర్చిస్తున్నారు. అందరికీ ధైర్యం చెబుతున్నారు.
ఇదేసమయంలో ప్రలోభాలకు లొంగవద్దని కూడా.. సూచిస్తున్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీ లతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని.. వాటిని నమ్మొద్దని తెలిపారు. పార్టీ మారొద్దని కూడా.. వేడుకున్నారు.
ఇక, ఈ పరాజయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న జగన్.,. ఎక్కడో ఏదో జరిగిందని భావి స్తున్నట్టు చెప్పారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎవరిపైనా తాను విమర్శలు చేయదలుచుకోలేదని తెలిపారు.
ఏదేమైనా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని చెప్పారు. ఇక, పార్టీపై ప్రజలకు నమ్మకంపోయిందన్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. ఇప్పటికీ ప్రజలు 40 శాతం మేరకు వైసీపీతోనే ఉన్నారని గుర్తు పెట్టుకోవాలన్నారు.
ఎందుకంటే.. తాజా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా.. ఓటు బ్యాంకు మాత్రం 39.98 శాతం వైసీపీకి దక్కింది. దీనిని దృష్టిలో పెట్టుకునే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, తాను త్వరలోనే ప్రజాయాత్రకు సిద్ధం అవు తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటన ఉంటుందని.. ప్రజలను కలుస్తానని.. పరిస్థితులపై తన పోరాటం ఆగదని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. వీటిని అందరూ తట్టుకుని ముందుకు సాగేందుకు పార్టీపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని జగన్ చెప్పారు.