“ప్రభుత్వాలు శాశ్వతం కాదు. అధికారులుగా మీరు 30 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేస్తారు. కానీ, గడిచిన ఐదేళ్లలో మీరు ఎవరికి చేశారో.. ఎందుకు అలా చేశారో.. ఎవరిని అణిచేశారో..ఎందుకు అణిచేశారో.. ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి” అని ఏపీలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులకు నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఉన్నతా ధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
సుమారు గంటకుపైగానే వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో ఎవరెవరు ఎలా వ్యవహరించారో పేరు పేరున వివరించారు. గడచిన ఐదేళ్లలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందని చెప్పారు. అంతేకాదు.. ప్రభుత్వాలు ఏవైనా అధికారులు ఇలా వ్యవహరిస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని హితవు పలికారు.
“నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఏమీ అనాలని అనుకోవడం లేదు. కానీ, మీకు మీరే ఆలోచించుకోండి. ఎవరు ఎలాంటి వ్యవహారాలు చేశారో.. ఇంతకన్నా చెప్పను. చెప్పాల్సి వచ్చే పరిస్థితిని మీరు తెచ్చుకున్నా.. ఉన్నతాధికారులుగా మీపై నాకున్న అభిప్రాయం మేరకు .. నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక, మీదట తప్పులు చేయకుండా సుపరిపాలన అందించేందుకు సర్కారుతో కలిసి పనిచేయండి. ఎవరికి వ్యక్తిగత అజెండాలు ఉండడానికి వీల్లేదు” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు ఐఏఎస్‌లు పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో మాదిరిగా అంతా బాగుందనే చర్చ తన వద్ద పెట్టవద్దని.. సమస్య ఏదైనా పరిష్కారానికి నిర్దిష్ట గడువు పెట్టుకుని దాని ప్రకారం ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. ఇక, రాష్ట్రంలోశాంతి భద్రతల పరిరక్షణకు ఐపీఎస్‌లు ఉమ్మడిగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తరలివస్తాయని.. ఈ విషయంలో మీరు ఎంత వరకు చేయగలరో అంతవరకు చేయాలని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఒక్కరు కూడా నోరువిప్పి మాట్లాడలేదు.