తెలంగాణలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ వ్యవహారం.. వివాదంగా మారింది. ఈ పంపిణీ పథకంలో అవినీతి చోటు చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఏసీబీ అధికారులు దీనిపై గత నెల రోజులుగా సైలెంట్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారు జరిపిన విచారణ సంచలనంగా మారి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా 700 కోట్ల రూపాయల మేరకు మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు.
ఆవెంటనే కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం అధికారి ఒకరు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంటనే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారుల కూడా ప్రాథమికంగా కేసును నమోదు చేశారు.
ప్రస్తుతం విచారణను కూడా ఈడీ అధికారులు ప్రారంభించారు. మనీలాండరింగ్ చట్టం కింద, ఈసీఐ ఆర్ నమోదు చేశారు. ఈ కుంభకోణలో పది మంది పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తిం చారు. వీరిలో ఇద్దరు మాజీ మంత్రుల కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆయా వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే.. ఈ వ్యవహారంపై బీఆర్ ఎస్ నేతలు మౌనంగా ఉన్నారు.
ఏంటీ పథకం..
బీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని పశుపాలకులకు.. గొర్రెలను ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీ, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల నుంచి నాణ్యమైన గొర్రెలను కొనుగోలు చేసి..తెలంగాణలోని పలు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఈ క్రమంలో భారీ ఎత్తున సొమ్ములు.. దోచుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం సైలెంట్‌గా ఏసీబీని రంగంలోకి దించగా.. రూ.700 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టు ప్రాధమికంగా గుర్తించారు.