అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. తలుపు తట్టినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో సమయానికి స్పందించిన వైసీపీ నాయకుడు ఒకరు.. లక్కు చిక్కించుకుని హ్యాపీగా ఉన్నారు. ఆయనే గొల్ల బాబూరావు. ఈయన ఉత్తరాంధ్రకు చెందిన ఎస్సీ నాయకుడు. సామాజిక వర్గం పరంగా మంచి పేరు సంపాయించుకున్నారు. సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయాల్లోనూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు.
వైఎస్‌కు అనుచరిడిగా పేరు కూడా సంపాయించుకున్నారు. వైఎస్ మరణం తర్వాత.. వైసీపీలోకి వచ్చా రు. ఇక్కడ కూడా మంచి నాయకుడిగానే ఎదిగారు. గతంలో ఎంపీగా కూడా విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆయనను మించిన అదృష్టవంతుడైన నాయకుడు కూడా ఎవరూ లేరని అంటున్నారు. ఎందుకంటే.. ఉత్తరాంధ్రలో వైసీపీ దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క అరకు మాత్రమే దక్కించుకుంది. అది కూడా ఎస్టీ నియోజకవర్గం. మిగిలిన వారు ఎవరూ విజయం దక్కించుకోలేక పోయారు.
కానీ, గొల్ల బాబూరావు విషయంలో ఎన్నికలకు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయనకు అప్పటి సీఎం జగన్ టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు. దీంతో కొంత ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేసిన గొల్ల బాబూరావుకు తన పరిస్థితి ఏంటని తలపట్టుకున్నారు. ఖచ్చితంగా అదే సమయంలో నలుగురు రాజ్యసభకు ఎంపికయ్యారు. వీరిలో ఒకరిగా సామాజిక సమీకరణల నేపథ్యంలో గొల్ల బాబూరావును జగన్ ఎంపిక చేశారు. అయిష్టంగానే అయినా.. బాబూరావు ఒప్పుకొన్నారు. కానీ, ఇప్పుడు అదే అదృష్టంగా మారింది.
ఆయన కూడా ఇతర నేతల్లా మంకు పట్టు పట్టి ఉంటే.. ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా తుడిచి పెట్టుకుని పోయేవారు. అంతేకాదు.. ఈ మధ్యలో నామినేటెడ్ పదవి కూడా.. ఆయనకు దక్కి ఉండేది కాదు. ప్రస్తుతం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. దీంతో వచ్చే ఐదేళ్ల వరకు నామినేటెడ్ పదవులు ఎవరికీ దక్కవు. అది కూడా.. వచ్చే 2029 ఎన్నికల్లో సక్సెస్ అయితే తప్ప.. ఎవరూ ఊహించేందుకు కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గొల్ల బాబూ రావు చాలా వరకు అదృష్ట వంతుడని అంటున్నారు నాయకులు. వచ్చే ఆరేళ్ల వరకు ఆయన ఈ రాజ్యసభ పదవిలో ఉండనున్నారు.