మెగా సోదరులతో ప్రధాని మోదీ మాస్

కొన్ని అరుదైన అద్భుతమైన జ్ఞాపకాలకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం వేదిక కానుందని ముందే ఊహించినప్పటికీ అంచనాలకు మించే కొన్ని ఘటనలు ఇవాళ జరిగాయి.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు చెరోవైపు పట్టుకుని పైకి ఎత్తి విజయ కేతనం చూపించడం ఒక్కసారిగా ఎక్కడ లేని కిక్ ఇచ్చింది. అంతకు ముందు అన్నయ్య ఎక్కడని మోడీ అడిగితే, అదిగో అక్కడ ఉన్నాడంటూ పవన్ చూపించడం, ఆపై ఇద్దరూ స్టేజి ఎడమ వైపు వెళ్లడం చూపరులకు మంచి కిక్ ఇచ్చింది.

ఇంతకన్నా ఎలివేషన్ ఏం కావాలంటూ మెగా ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మోడీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో గతంలోనూ బయట పడింది. గత సర్కారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోడీ అతిధిగా వచ్చినప్పుడు అదే పనిగా జగన్, రోజాలను విస్మరించి మరీ చిరుని ఆప్యాయంగా పలకరించిన వీడియో బాగా వైరలయ్యింది. ఇప్పుడు అంతకు మించి అనే స్థాయిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు ప్రాముఖ్యత ఇవ్వడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు దీన్ని ఏకంగా స్టేటస్ గా పెట్టుకుంటున్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవన్ కళ్యాణ్ తో సహా అందరికీ రేపటి నుంచి ఎన్నో బాధ్యతలు స్వాగతం చెప్పబోతున్నాయి. మార్పు, అభివృద్ధి కోసం కూటమికి ఓట్లు వేసిన ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. రాజధానితో మొదలుపెట్టి ఉద్యోగాలు, ప్రాజెక్టుల దాకా పలు సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ప్రమాణస్వీకారం తాలూకు ఎలివేషన్, హై మహా అయితే ఇంకో రెండు మూడు రోజులు ఉంటుంది కానీ అసలు కార్యాచరణ ఇకపై సిద్ధం చేయాలి. ఏది ఏమైనా ఒక మాస్ సినిమా చూసినన్ని మంచి మూమెంట్స్ అభిమానులకు ఇవాళ దక్కాయి.