హ్యాట్రిక్ తో పాటు మంత్రి పదవి కొట్టేశారు !

నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గడపకూ పరిచయం అయిన పేరు. పాలకొల్లు మండలం అగర్తి పాలెంకు చెందిన రామానాయుడు 2005లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్ డి పట్టా పట్టాపొందిన వ్యక్తి. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన ప్రత్యేకత.

గత 20 ఏళ్ల క్రితం రామానాయుడు తన తండ్రి ధర్మారావు పేరిట ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా ఆసరాగా నిలుస్తున్నారు.

20 ఎకరాలు ఉండగా 10 ఎకరాల నుండి వచ్చే ఆదాయాన్ని ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు వినియోగిస్తున్నారు. 2014 – 2019 మధ్యకాలంలో పాలకొల్లుకు దాదాపు రూ.600 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని పేరుంది. స్వయంగా రైతు అయిన రామానాయుడు రైతు ఉద్యమాలకు చేయూత అందిస్తారని, రైతు సమస్యలపై స్పందిస్తాడని పేరుంది.

2014లో టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసిన రామానాయుడు వైసీపీ అభ్యర్థి మేకా శేషుబాబుపై 6383 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్యనారాయణ మూర్తిపై మెజారిటీ పెంచుకుని మరీ 17,809 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాల రావుపై ఏకంగా 67,945 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో రామానాయుడుకు 1,13,114 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి 45,169 ఓట్లకు పరిమితం అయ్యారు.

వైసీపీ హయాంలో రాష్ట్రమంతటా అన్న క్యాంటీన్లను మూతవేయగా ఒక్క పాలకొల్లులో రామానాయుడ కష్టనష్టాలకు ఓర్చి కొనసాగించడం విశేషం. గత పదేళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా ఈ సారి ఎన్నికలలో విజయం కోసం నిమ్మల నియోజకవర్గం అంతా పాదయాత్ర చేయడంతో పాటు, ఎక్కడికక్కడ రోడ్ల మీదనే విశ్రాంతి తీసుకుని, ఆరుబయటే బసచేసి, కాలకృత్యాలు తీసుకుని ప్రజాదరణ సాధించడం విశేషం. అందుకే రామానాయుడు ఈసారి చంద్రబాబు దృష్టిని ఆకర్షించి మంత్రి పదవిని సాధించాడని పాలకొల్లులో ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.