ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చేసింది

ఇంకాసేపట్లో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫలానా పార్టీ గెలిచిందని తెలిశాక సాధారణంగా జనం రాజకీయ ఊసులు మర్చిపోయి తమ దైనందిన జీవితంలో బిజీ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు.

టిడిపి జనసేన బిజెపి కూటమికి దక్కిన అసాధారణ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇవాళ్టి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవాన్ని కనులారా ప్రత్యక్షంగా, టీవీలో లైవ్ టెలికాస్ట్ ద్వారా చూసేందుకు కోట్లాది అభిమానులు సిద్ధమవుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ట్రెండ్స్ లో అర్ధరాత్రి దాటినా వీటి కబుర్లే ఉన్నాయి.

ఇంతలా పరిస్థితి మారిపోవడానికి కారణం లేకపోలేదు. జగన్ సర్కారు మీద ప్రజల్లో ఉన్న విపరీతమైన వ్యతిరేకత, అసంతృప్తి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ల మీద నమ్మకాన్ని రెట్టింపు చేశాయి.

గత ఎలక్షన్లలో పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయిన స్థితి నుంచి వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలను గెల్చుకోవడం వరకు పవన్ చేసిన పోరాటం అభిమానులనే కాదు సగటు పబ్లిక్ ని సైతం ఆకట్టుకుంది. ఇక చంద్రబాబునాయుడు ఏడు పదుల వయసులోనూ అలుపు తెలియకుండా ఊరూరా తిరిగి తానేం చేయబోయేది స్పష్టంగా వివరించడం మంత్రంలా పని చేసింది.

తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహం అంబరాన్ని తాకుతుంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని స్పష్టమైన లీక్ వచ్చేయడంతో కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ వేదిక మీద తమ హీరో పలికే మాటలకు బి బాహుబలి రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

నాలుగో పర్యాయం సిఎం కాబోతున్న చంద్రబాబునాయుడు కోసం ప్రధాని మోడీ, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి మహామహులు వస్తున్నారు. తమ్ముడిని చూసి మురిసిపోవడానికి చిరంజీవికి ఇంతకన్నా సందర్భం ఏముంటుంది.