‘రెండు’ సంత‌కాల‌కు ఫైళ్లు రెడీ!

టీడీపీ నేతృత్వంలోని బీజేపీ, జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనే ఉంటుంద‌ని చెప్పిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు హామీ నెర‌వేర‌నుంది. ఈ మేర‌కు సంబంధిత ఫైలును అధికారులు రెడీ చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మెగా డీఎస్సీ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కీల‌క చ‌ర్చ‌కు దారి తీసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా వేయ‌క‌పోవ‌డంతో విసుగెత్తిన నిరుద్యోగు లు కూట‌మి పార్టీల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.

ఈ నేప‌థ్యంలో వారి నాడిని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు తాము అధికారంలోకి రాగానే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైలుపైనే ఉంటుంద‌ని చెప్పారు. ఇచ్చిన హామీని నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఆయన తొలి సంత‌కానికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేశారు. బుధ‌వారం చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అనంత‌రం.. తొలి సంత‌కం ఈ ఫైలుపైనే చేయ‌నున్నారు. అదేవిధంగా చంద్ర‌బాబు రెండో సంత‌కానికి సంబంధించిన ఫైలుకూడా రెడీ అయింది.

ఈ ఫైలుపై కూడా.. చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం చేయ‌నున్నారు. ఇది.. అత్య‌త కీల‌క‌మైన‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుకు సంబంధించిన ఫైలు కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ఈ చ‌ట్టంపై ఎన్నిక ల‌స‌మ‌యంలో తీవ్ర దుమారం రేగింది. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను హ‌రించేలా ఉన్న ఈ చ‌ట్టంపై అనేక చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు తాము అధికారంలోకి వ‌స్తే.. ఈ చ‌ట్టాన్నిరద్దు చేస్తామ‌ని చెప్పారు.

ఆయ‌న చెప్పిన‌ట్టుగానే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌రుక్ష‌ణం రెండో సంత‌కం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుపైనే ఉండ‌నుంది. దీనికి సంబంధించి కూడా.. అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అటు డీఎస్సీ, ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుకు సంబంధించిన ఫైళ్ల‌ను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ముందుగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి చూపించ‌నున్నారు. అనంత‌రం.. బుధ‌వారం జ‌రిగే చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో వీటిపై సంత‌కం చేయ‌నున్నారు.