బండికి బంప‌ర్ ఆఫ‌ర్

Bandi Sanjay
Bandi Sanjay

తెలంగాణ‌లో బీజేపీ కీల‌క నేత బండి సంజ‌య్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. కొత్త‌గా ఏర్ప‌డే కేంద్ర మంత్రివ‌ర్గంలో బండి సంజ‌య్‌కు చోటు ద‌క్కింది. కొన్నేళ్లుగా తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం కోసం ఆయ‌న చేసిన కృషికి ఇప్పుడు త‌గిన గుర్తింపు ద‌క్కింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో బండి సంజ‌య్ అభిమానులు, అనుచ‌రులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. కేంద్రంలో కొత్త‌గా ఏర్ప‌డే మోడీ కేబినేట్‌లో తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌కు అవ‌కాశం ద‌క్కింది. కిష‌న్ రెడ్డి గ‌త బీజేపీ ప్ర‌భుత్వంలోనూ కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ ఉత్త‌మ ఫ‌లితాలు సాధించింది. గ‌త ఎన్నిక‌ల కంటే 4 స్థానాలు ఎక్కువ‌గా గెలుచుకుంది. దీంతో తెలంగాణ‌లో ఆ పార్టీ బ‌లం 8కి పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌కు రెండు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం కోసం బండి సంజ‌య్ శ్ర‌మిస్తూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన బండి సంజ‌య్‌.. ఆ త‌ర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా గెలిచారు. అనంత‌రం తెలంగాణ పార్టీ అధ్య‌క్షుడిగా ఇక్క‌డ బీజేపీని ప‌రుగులు పెట్టించారు.

బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లో బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. క్షేత్ర‌స్థాయికి పార్టీని తీసుకెళ్లారు. నిరుడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ అధ్య‌క్షుడిగా త‌ప్పించినా తెలంగాణ‌లో మెరుగైన ఫ‌లితాలు సాధించేందుకు క‌ష్ట‌ప‌డ్డారు. పాద‌యాత్ర కూడా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి 8 సీట్లు ద‌క్క‌డంలో సంజ‌య్ పాత్ర కూడా ఉంది. అనంత‌రం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. ఈ ప‌ద‌వితో బండి సంజ‌య్ తెలంగాణ‌లో పార్టీ ప‌టిష్ఠం కోసం మ‌రింత జోష్‌తో ప‌నిచేసే అవ‌కాశ‌ముంది.