రామోజీ పేరు-ఇంటిపేరు ఇలా మారాయి

ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధిప‌తి.. మీడియా సామ్రాజ్యాన్ని నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా శాసిస్తున్న రామోజీ రావు… భౌతికంగా వెడ‌లిపోయారు. ఆయ‌న వ‌దిలి వెళ్లిన‌.. అనేక నిబ‌ద్ధ‌త‌లు.. పాత్రికేయ ప్ర‌పంచాన్ని ఎప్పుడూ ముందుకు న‌డిపిస్తుంటాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే.. రామోజీ గురించి చెప్పుకొనే విష‌యాలు అనేకం ఉన్నాయి. వీటిలో ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబందించి రెండు కీల‌క విష‌యాలు చాలా మందికి తెలియ‌దు.

అవే.. రామోజీ పేరు, ఆయ‌న ఇంటి పేరు వ్య‌వ‌హారాలు. ఈ రెండు కూడా.. ఆయ‌న మార్చుకున్న విష‌యం చాలా మంది తెలియ‌దు. విద్యార్ధి ద‌శ నుంచే ఉద్య‌మాల‌తో ప్రారంభ‌మైన‌.. రామోజీ ప్ర‌స్థానం.. ప‌త్రిక స్థాప‌న వ‌ర‌కు.. క‌మ్యూనిస్టుల‌తోనే ముందుకు సాగింది. ముఖ్యంగా.. పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌య్య‌.. మోటూరి హ‌నుమంత‌రావు స‌హా అనేక మంది దిగ్గ‌జ‌కామ్రెడ్ల‌తో క‌లిసి.. రామోజీ న‌డిచారు. క‌మ్యూనిస్టు ఉద్య‌మాలకు.. ఆయ‌న చాలా ప్ర‌భావిత‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలోనే దేవుడిని ప‌క్క‌న పెట్టారు రామోజీ. ఆయ‌నకు విశ్వాసం ఉంది.. అంతే! ఇంత‌కు మించి అంటే… ఏమీ లేదు. ఆయ‌న ఏ గుడికీ వెళ్ల‌రు. ఏ కొండ‌కూ మొక్క‌రు. దీనికి కార‌ణం.. క‌మ్యూనిస్టు హేతు వాదం. ఇక‌, పేరును కూడా.. ఆయ‌న మార్చుకున్నారు. పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌రామిరెడ్డిగా ఉన్న పేరును సుంద‌ర‌య్య‌గా మార్చుకున్న స‌మ‌యంలోనే.. చెరుకూరి రామ‌య్య‌గా ఉన్న పేరును రామోజీగా మార్పు చేసుకున్నారు. హైద‌రాబాద్ నిజాంల‌ పాల‌న‌పైనా.. సాయుధ రైతాంగ పోరాటాల‌పైనా.. క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి పోరాడారు.

ఇక‌, ఇంటి పేరు విష‌యంలోనూ ఆయ‌న మార్పు చేసుకున్నారు. ఆయ‌న‌కు అస‌లు ఇంటి పేరే లేదంటే అతిశ‌యోక్తి కాదు.. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా ఆయ‌న ప్ర‌భుత్వ ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. త‌న‌కు ఇంటి పేరు అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వానికి అర్జీ పెట్టుకుని గెజిట్ విడుద‌ల చేయించుకున్నారు. అందుకే.. ఆయ‌న ఎక్క‌డ సంత‌కం చేయాల్సి వ‌చ్చినా.. ఇంటి పేరు ఉండ‌దు. కేవలం రామోజీరావు అనే ఉంటుంది. ఇదంతా.. క‌మ్యూనిస్టుల నుంచి వ‌చ్చిన హేతువాద దృక్ఫ‌థ‌మేన‌ని ఆనాటి ఆయ‌న స‌హ‌చ‌రులు చెబుతారు.