ఏదీ మునుపటిలా ఉండదు- ధూమపానంపై వచ్చిన ఓ యాడ్‌లో డైలాగ్ ఇది. ఇది .. ఇప్పుడు రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. కేంద్రంలో ఏర్పడనున్న నరేంద్ర మోడీ సర్కారుకు బొటా బొటీ మెజారిటీనే దక్కింది. అది కూడా..ఎన్డీయే భాగస్వామ్య పక్షాల చేరికతో సొంతంగా బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. మేజిక్ ఫిగర్ ప్రకారం.. మరికొన్ని పార్టీలు చేతులు కలిపాయి. వీటిలో చంద్రబాబు పార్టీ టీడీపీ నుంచి సొంతంగా 16 మంది ఎంపీలు, బీహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. మిగిలిన చిన్నా చితకా పార్టీలకు మరికొన్ని ఉన్నాయి.
వీటి దన్నుతోనే మోడీ అధికారంలోకి వస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరి అభిప్రాయం.. అంచనాలు.. లేకుండా.. మోడీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అంటే.. ఏదీ మునుపటిలా ఉండదు. గతంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు చాలానే ఉన్నాయి. ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టం.,. సీఏఏ వంటివి కీలకం. అదేవిధంగా జమ్ము కశ్మీర్ కు చెందిన ఆర్టికల్ 370 రద్దు కూడా.. ఈ జాబితాలో ఉంది. కానీ ఇప్పుడు వీటిని మించిన లక్ష్యాలు పెట్టుకున్నారు. అయితే.. బీజేపీ ఒంటరిగా 2014, 2019లో మెజారిటీ దక్కించుకున్న నేపథ్యంలోనే ఆ సొంత నిర్ణయాలు సాధ్యమయ్యాయి.
కానీ, ఇప్పుడు లోక్‌సభలో చంద్రబాబు, నితీష్ పార్టీలు కీలకంగా మద్దతు ఇవ్వకపోతే.. మొత్తానికే మోడీ సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ తీసుకునే నిర్ణయాలకు చంద్రబాబు, నితీష్ బ్రేకులు వేయడమా.. కొనసాగించడమా.. అనే నిర్ణయాలు తీసుకునే ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా చంద్రబాబు పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంటే.. మోడీ, అమిత్ షాలకు మునుపటి మాదిరిగా.. నిర్ణయాలు తీసుకుని.. సీబీఐ, ఈడీలను ప్రయోగించడం దగ్గర నుంచి ఇతర నిర్ణయాల వరకు కూడా.. ఏదీ మునుపటిలా ఉండదనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.
వాస్తవానికి.. గత పదేళ్ల మోడీ పాలనలో మూడు రైతు చట్టాలు చేశారు. వీటిని సొంత పార్టీ(ఎన్డీయే కూటమి) నేతలే వ్యతిరేకించారు. కొందరు ఎంపీలు బయటకు కూడా వచ్చేశారు. అయినా.. మోడీ ఆ నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి కారణం.. బీజేపీకి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండడమే. అయితే.. వాటిపై రైతుల్లోను, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెగిన నేపథ్యంలో వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి తీసుకురావాలని ఉన్నా.. తీసుకువచ్చే అవకాశం లేదు. ఇక, పదేళ్ల మోడీ పాలనలో ఒకే రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇచ్చారన్న విమర్శలు వున్నాయి. ఇప్పుడు అవి సాగవు. మొత్తంగా .. మోడీ పాలనకు చంద్రబాబు, నితీష్‌లు.. కుడి ఎడమ బ్రేకులుగా మారుతారని అంటున్నారు పరిశీలకులు.